గోస్తనీ నది కాలుష్యంపై పవన్ సీరియస్... చర్యలకు ఆదేశం

by Vemula.Srinu Prasad |

దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో... ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు...

గోస్తనీ నది కాలుష్యంపై పవన్ సీరియస్... చర్యలకు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో... ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలని పవన్ పేర్కొన్నారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. “కొన్ని ప్రాంతాల్లో జనావాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుళ్లు దాటికి ఇళ్లకు బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.’’ అని పవన్ ఆదేశించారు.

బాధితుల భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలు

‘‘కాలుష్క నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంలాగా మారిపోయింది. దీంతో క్షేత్ర స్థాయిలో కాలుష్య సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వామ్యం చేస్తే... తనిఖీలు పారదర్శకంగా జరగడంతోపాటు బాధితులకు న్యాయం జరుగుతుంది. ’’ అని పవన్ పేర్కొన్నారు.

ఎవరికీ మినహాయింపులు లేవు

‘‘శబ్ద కాలుష్యం నియంత్రణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు కచ్చితంగా పాటించాలి. ఇండస్ర్టియల్, కమర్షియల్, రెసిడెన్సియల్, సెన్సిటివ్ జోన్లలో నిర్దేశిత డెసిబెల్ పరిమితులను కచ్చితంగా పాటించాలి. ప్రార్థనా మందిరాలైనా జోన్ల వారీగా నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిందే... ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు.’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

వైట్ కేటగిరి పరిశ్రమలు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయి

‘‘నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద రిజిస్టర్ అయి, నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. బయటకు అస్సలు కాలుష్యం కలిగించని పరిశ్రమలు అని చెప్పుకుంటూ ఆర్గానిక్ వేస్ట్, రసాయన వ్యర్ధాలను బయటకు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి పరిశ్రమల నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సాంకేతికతను వాడి దుర్వాసన తగ్గించే పద్ధతులను పాటించేలా చేయాలి.’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.

కాలుష్య కోరల్లో గోస్తనీ నది

‘‘గోస్తనీ నది తీవ్రమైన కాలుష్యం బారిన పడింది. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ పరిధిలో సేకరించిన నీటి నమూనాలలో బయోలాజికల్ ఆక్సిజెన్ డిమాండ్ 15 mg/l చేరడం అనేది పర్యావరణ అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. ఈ నమూనాల ప్రకారం కాలుష్యం అనుమతించదగిన స్థాయి కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. పరిశ్రమల నుంచి నేరుగా నదిలోకి వచ్చే మురుగు, రసాయన వ్యర్ధాలను డ్రోన్, వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేసి సంబంధిత పరిశ్రమలను బాధ్యులను చేయాలి.’’ అని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story