- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో డెంగ్యూ కలకలం.. లక్షణాలు, నివారణాలు ఇవే!
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు (Seasonal diseases) కూడా విపరీతంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో డెంగ్యూ (Dengue) కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డెంగ్యూ అనుమానిత లక్షణాలతో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూ అనుమానిత లక్షణాలతో తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి అనే దంపతులు మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి, డెంగ్యూపై అవగాహన చర్యలు చేపట్టారు.
డెంగ్యూ జ్వరం లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు:
* 102 డిగ్రీల జ్వరం, కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి, ఒంటి నొప్పులు, ఒంటిపై ఎర్రటి దద్దర్లు ఉంటే డెంగీ జ్వరంగా అనుమానించాలి.
* వైరల్ వల్ల కూడా తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు తదితర డెంగీ తరహా లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి.
* మూడు రోజుల తర్వాత కూడా అవే లక్షణాలు కొనసాగితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
* డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే ఎన్‌ఎస్ 1 యాంటిజెన్ టెస్ట్ చేయించాలి.
* వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలి. జ్వరం వచ్చి 5 రోజులు దాటితే డెంగీ నిర్ధారణకు IGM యాంటీబాడీల పరీక్ష చేయాల్సి ఉంటుంది.
* కిడ్నీపై ప్రభావం, బీపీ తగ్గడం, వాంతులు, రక్తస్రావం, లివర్, కడుపులో నొప్పి తదితర సమస్యలు ఏర్పడితే వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే బ్రెయిన్ హేమరేజ్‌కు దారి తీసే అవకాశం ఉంది.
* డెంగీని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది.
* ఒకవేళ డెంగ్యూ తీవ్రమైనప్పుడు ఎమర్జెన్సీగా భావించాలి.
* అప్రమత్తంగా ఉంటూ ప్లేట్‌లెట్లు, బీపీ తగ్గకుండా చూసుకోవాలి. జ్వరం తగ్గినా జాగ్రత్తగా ఉండి ప్లేట్‌లెట్లు చూసుకోవాలి.
* పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి.
ముందు జాగ్రత్త చర్యలు:
*ఈడిస్ దోమ కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరానికి కారణమయ్యే వైరస్ వ్యాపిస్తుంది.
* ఈ దోమలు ఎక్కువగా పగటిపూటే కుడుతాయి కాబట్టి, దోమలు ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* తప్పనిసరిగా ఇండ్లలో తప్పనిసరిగా దోమతెరలు వాడాలి.
* వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి.
* ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
* పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు తొడిగించాలి.
* అధిక జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.






