టీడీపీకి అస్త్రంలా ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఇక పోరుబాటేనట

by Disha Web Desk 16 |
టీడీపీకి అస్త్రంలా ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఇక పోరుబాటేనట
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు ఏకంగా 16 నెలలు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే రాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. శీతాకాలంలో కూడా రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. రాత్రిపూట చలి ఉదయం రాజకీయ వేడితో రాష్ట్రం అట్టుడుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని టీడీపీ ఇతర పార్టీలు యత్నిస్తున్నాయి. టీడీపీతోపాటు ఇతర పార్టీలపై వైసీపీ సింగిల్‌గా ఎదురుదాడి చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని అటు చంద్రబాబు ఇటు పవన్ కల్యాణ్ మరోవైపు బీజేపీ ఎంత ప్రయత్నించినప్పటికీ అందుకు అస్త్రాలు మాత్రం దొరకడం లేదు. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతల బంధువులు, వైసీపీ నేతల పేర్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో పొందుపరచడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై వైసీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీకి తాజాగా ఈడీ రిమాండ్ రిపోర్టులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఉండటం కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ జిల్లాలు చుట్టేస్తున్న చంద్రబాబుకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు ఏపీలో బయటపడుతుండటం ఒక ఆయుధంగా దొరికిందని ప్రచారం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో కల్తీ మద్యంపై పెద్ద ఎత్తున ఉద్యమం కాస్త మైలేజ్ పెంచేందుకు తోడ్పడింది. అయితే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత మేర మైలేజ్ తీసుకువస్తుందనేది వేచి చూడాలి.

రిమాండ్ రిపోర్టులో ఏముందంటే

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఈడీ దూకుడు పెంచింది. ఒకవైపు అరెస్ట్‌లు చేస్తూనే మరోవైపు రిమాండ్ రిపోర్టులను బయటపెట్టి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌‌లో కీలక ట్విస్ట్ నెలకొంది. రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వైసీపీ కీలక నేత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును రిపోర్టులో చేర్చింది. ఎంపీతోపాటు ఎమ్మెల్సీ కవిత పేరును కూడా చేర్చింది. 'శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ.100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ డబ్బు సమకూర్చిన వారిలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లును రిమాండ్ రిపోర్టులో ఈడీ చేర్చింది. అంతేకాదు ఇదే విషయాన్ని అమిత్ అరోరా వాంగ్మూలం ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు డిజిటల్ సాక్ష్యాలను సైతం ధ్వంసం చేశారు అని ఈడీ రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. అయితే లిక్కర్ స్కాంతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.

అతనెవరో తెలీదు: మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరు ఉండటం ఒక కుట్ర అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సౌత్ ఇండియా వ్యాపారులపై ఉత్తరాది వారు చేస్తున్న దాడిగా ఎంపీ మాగుంట ఆరోపించారు. అందులో భాగంగానే చార్జిషీట్‌లో తమ పేర్లు చేర్చారని తెలిపారు. అమిత్ అరోరాకు చెందిన సౌత్ గ్రూప్‌లో తనకు గానీ తన కుమారుడికి గానీ ఎలాంటి షేర్లు లేవని ప్రకటించారు. అమిత్ అరోరాతో తమ కుటుంబ సభ్యులు ఎప్పుడూ మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. అసలు అతనెవరో తనకు తెలియదన్నారు. అలాంటి తనపేరును అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో చేర్చడం తెలుసుకుని ఆశ్చర్యపోయానని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. గతంలో తాను లిక్కర్ వ్యాపారాలు చేసిన మాట కరెక్టేనని, ఇప్పుడు తాము గానీ, తమ కుటుంబ సభ్యులు గానీ అసలు ఆ వ్యాపారాలు చేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు చెప్తానని అన్నారు. గ‌తంలో తమ కుటుంబం లిక్కర్ వ్యాపారాలు చేసేదని, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడా లిక్కర్ వ్యాపారాలు చేయడం లేదని స్పష్టం చేశారు. అలాంటిది కోట్లాది రూపాయ‌లు తాను ఇచ్చాన‌న‌డంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి పారేశారు.

టీడీపీకి ఆయుధం దొరికినట్లేనా?

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా వీస్తోంది. వైసీపీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటిని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లడంలో విపక్షాలు ఫెయిల్ అయ్యాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అవకాశం కోసం ఎదురుచూస్తోంది. వైసీపీని ఇరుకున పెట్టేందుకు ఛాన్స్ కోసం వేచి చూస్తున్న టీడీపీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక అస్త్రంలా తయారైంది. ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీతోపాటు ఇతర పార్టీలు విజయసాయిరెడ్డిని, వైసీపీని టార్గెట్ చేశాయి. టీడీపీ దాడిని ఎదుర్కోవడానికి వైసీపీ నేతలు మూడు చెరువుల నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని ప్రజలు మరచిపోతున్నారనుకున్న తరుణంలో తాజాగా ఈడీ అరోరా రిమాండ్ రిపోర్టులో వైసీపీ కీలక నేత, ఎంపీ మాగుంట‌ శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి రావడం కాస్త చర్చనీయాంశంగా మారింది. మెున్నటి వరకు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, ఇప్పుడు వైసీపీ ఎంపీ పేరు ఉండటం టీడీపీకి ఆయుధం ఇచ్చిన‌ట్టైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేత‌ల‌కు లిక్కర్ కుంభ‌కోణంలో పాత్ర ఉందని విమర్శించే ఛాన్స్ టీడీపీకి దొరికింది. మరి ఈ అవకాశాన్ని అయినా టీడీపీ సద్వినియోగం చేసుకుంటుందా..?.లేదా అనేది వేచి చూడాలి.


Next Story