ప్రాణంగా ప్రేమించిన యువతికి పెళ్లి.. భరించలేక యువకుడు సూసైడ్

by Naga Rani Yarlagadda |

ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి కావడాన్ని భరించలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రాణంగా ప్రేమించిన యువతికి పెళ్లి.. భరించలేక యువకుడు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమలో ఫెయిలవ్వడంతో మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరగడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ విద్యార్థి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు తన తల్లిని బాగా చూసుకోవాలని బాబాయ్, సోదరికి మెసేజ్ లు పంపాడు. ఈ హృదయ విదారక ఘటన ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో వెలుగుచూసింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరమణ లే అవుట్లో జరిగిన విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన జె. మహేంద్ర (20) తిరుపతిలోని ఓ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. నగరంలోని వెంకటరమణ లే అవుట్లో తన ఫ్రెండ్స్ తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. వారంరోజుల క్రితం తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లైందని తెలిసి మహేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విషయం ఇంట్లో చెప్పకుండా.. తనలో తానే కుమిలిపోయాడు. భరించలేక తన గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. దానికంటే ముందు.. తనను క్షమించాలని, అమ్మంటే చాలా ఇష్టమని, ఆమెను బాగా చూసుకోవాలని కోరాడు. గమనించిన స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Next Story