పోర్టల్ ఏర్పాటు చేసుకొని పర్యవేక్షించాలని నిర్ణయం : మంత్రి టీజీ భరత్

by Thanuru Gopichand |

రాష్ట్రంలోని పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.

పోర్టల్ ఏర్పాటు చేసుకొని పర్యవేక్షించాలని నిర్ణయం : మంత్రి టీజీ భరత్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 13వ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో ఎనర్జీ, ఐ అండ్ ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు గురించి తెలియజేశారు.

విద్యుత్ రంగంలో 40, పరిశ్రమలు-కామర్స్ రంగాల్లో 21 శాతం ఎంఓయులు జరిగాయని మంత్రి అన్నారు. ఐ అండ్ ఐ లో 13, ఐటీఐలో 12 శాతం, ఇతరాత్ర రంగాల్లో 14 శాతం ఎంఓయులు అయ్యాయని వివరించారు. అయితే ఎంఓయులను పోర్టల్ లో అప్లోడ్ చేసి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు సమావేశంలో నిర్ణయించడం జరిగిందన్నారు. దావోస్ ఫోరమ్ కు ముందే వీలైనన్ని శంకుస్థాపనలు జరగాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు డెడికేటెడ్ అధికారిని నియమించడం జరుగుతుందని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పర్యటక రంగంలో రూ.21 వేల కోట్ల పెట్టుబడులకు, విద్యుత్ రంగంలో రూ.4.54 లక్షల కోట్ల పెట్టుబడులకు, ఇండస్ట్రీస్, కామర్స్ లో రూ.2.02 లక్షల కోట్ల పెట్టుబడులకు, ఐటీ రంగంలో రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయులు చేసుకోవడం జరిగిందని వెల్లడించారు.

అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.8,519 కోట్ల పెట్టుబడులకు, సీఆర్డీఏకు సంబంధించి రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు, మారిటైమ్ బోర్డు కింద రూ.16లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు. ఎర్లీ బర్డ్ ప్రోత్సాహాకాల కింద ఆరు కంపెనీలకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు.

ఎంఓయులపై సమీక్ష జరిగింది : మంత్రి కందుల దుర్గేష్

ఎస్ఐపీబీ సమావేశంలో విశాఖ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయులపై సమీక్ష జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిర్ణీత కాలపరిమితిలో ఎంఓయుల అమలుకు వీలుగా చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. సీఎం, మంత్రివర్గ ఉప సంఘం, సీఎస్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని తెలియజేశారు. దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారన్నారు. సీఐఐ సదస్సు, గత ఒప్పందాల్లో 50 శాతం ప్రక్రియ ఇప్పటికే మొదలైందని స్పష్టం చేశారు. విశాఖ పరిధిలో రూ.1.69 లక్షల కోట్లు, అమరావతి పరిధిలో రూ.87వేల కోట్ల పెట్టుబడులు, తిరుపతి పరిధిలో రూ.73వేల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మొదలైందని మంత్రి దుర్గేష్ ప్రకటించారు.

Next Story