ఏపీలో దారుణ ఘటన.. తల్లి బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్.. భూమి విక్రయం

by Muthe.Rajitha |

ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.

ఏపీలో దారుణ ఘటన.. తల్లి బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్.. భూమి విక్రయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి జీవించి ఉండగానే మృతి చెందినట్లు కుమారుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆమె పేరున ఉన్న భూమిని విక్రయించిన ఘటన వెలుగు చూసింది. ఆర్డీవో రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామానికి చెందిన విప్పల రమాదేవి అనే 83 ఏళ్ల వృద్ధురాలికి 1995లో భర్త సెటిల్‌మెంట్ ద్వారా సర్వే నంబర్‌ 155/1లో 1.96 ఎకరాల భూమి లభించింది. ఆమె గుంటూరులోని వృద్ధాశ్రమంలో ఉంటుండగా కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తల్లి మృతి చెందినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించి భూమిని తన పేరుమీద మార్చుకుని 2024లో వేరే వ్యక్తికి విక్రయించాడు.

ఈ విషయమై రమాదేవి ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్నకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన ఆర్డీవో విక్రయ దస్తావేజును రద్దు చేయాలని, వెబ్‌ల్యాండ్‌లో తిరిగి రమాదేవి పేరునే భూమిని నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం కుమారుడు ప్రతి నెలా రూ.15 వేల చొప్పున తల్లికి పోషణ ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అక్రమ వ్యవహారంలో సహకరించిన తహసీల్దార్, వీఆర్వోలు, తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఆర్డీవో తెలిపారు.

Next Story