తిరుమలలో అరంగేట్రం పేరుతో నృత్యకళాకారులను మోసం చేసిన నిర్వాహకుడు : టీటీడీలో కలకలం

by Naga Rani Yarlagadda |

తిరుమలలో కళాప్రదర్శన, అరంగేట్రం పేరుతో నృత్యకళాకారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

తిరుమలలో అరంగేట్రం పేరుతో నృత్యకళాకారులను మోసం చేసిన నిర్వాహకుడు : టీటీడీలో కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో కళాప్రదర్శన, అరంగేట్రం పేరుతో నృత్యకళాకారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ఖాజీపేటకు చెందిన అభిషేక్ అనే వ్యక్తి ‘అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ’ (Annamacharya Arts Academy), ‘అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్’ పేరుతో సంస్థను నడుపుతూ.. తిరుమలలో ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి కళాకారులను మోసగించాడు.

అరంగేట్రం, నృత్య ప్రదర్శన పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసిన అభిషేక్, వారికి ప్రదర్శన తేదీ, సమయం పేర్కొన్న లేఖలు, ఐడీ కార్డులు జారీ చేశాడు. ఈ నెల 21న టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ (Hindu Dharma Prachara Parishad) నుంచి అనుమతి పొందినట్టు చెప్పాడు. కానీ నగదు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో టీటీడీ అదనపు ఈవో వెంటనే అనుమతిని రద్దు చేశారు.

దీంతో నిర్వాహకుడు అభిషేక్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు టీటీడీని 27, 28 తేదీల్లో రోజుకు 600 మందికి చొప్పున 1200 మందికి ప్రదర్శనకు అనుమతించమని ఆదేశించింది. అయితే అభిషేక్ దాదాపు 2 వేల మందికి పైగా కళాకారులకు ఆహ్వానం పంపడంతో తిరుమల ఆస్థాన మండపం వద్ద గందరగోళం నెలకొంది. అనుమతించని కళాకారులను బయట నిలిపేయడంతో వారు నిరసనకు దిగారు.

ఈ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులు అక్కడకు చేరుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మిగిలిన కళాకారులను కూడా ప్రదర్శనలో భాగంగా అనుమతించారు. బాధితుల ఫిర్యాదుతో అభిషేక్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటన నృత్య కళాకారులతో పాటు టీటీడీ పరిపాలనపై కూడా విమర్శలు తెచ్చిపెట్టింది.

Next Story