- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. భార్యతో మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
పావని... భోజనం చేశావా? పిల్లలు తిన్నారా? నాన్న ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. బాగా చూసుకో. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి.

దిశ, వెబ్‌డెస్క్: "పావని... భోజనం చేశావా? పిల్లలు తిన్నారా? నాన్న ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. బాగా చూసుకో. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అందమైన ఇల్లు కట్టుకుందాం. పిల్లలను బాగా చదివించాలి. నేను ఇప్పటివరకూ రూ.34 లక్షలు అప్పు చేశా.. నువ్వే ఇప్పుడు కుటుంబానికి అండగా ఉండాలి.."
ఇదీ తన భార్యతో చేసిన చివరి సంభాషణ. ఇది జరిగిన కొద్ది క్షణాలకే.. సీఆర్‌పీఎఫ్ జవాన్ కంచుకుంట మురళి తుపాకీతో తనను తానే కాల్చుకున్నాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ సమీపంలోని 65వ బెటాలియన్ క్యాంపులో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. మురళి భార్య "హలో... ఏమండీ... మాట్లాడండి" అంటూ పలుమార్లు పిలిచినా, సమాధానం రాలేదు. ఫోన్ అటే ఉండిపోయింది. సమీపంలోని జవాన్లు భారీ శబ్దం విని అక్కడికి చేరుకున్నపుడు, మురళి మరణించిపోయినట్టుగా కనుగొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం శివపురంకొట్టాలకు చెందిన ముత్యాలన్న - నాగలక్ష్మీ దంపతుల కుమారుడు మురళి, 2017లో సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. అనంతపురానికి చెందిన లోకపావని అనే యువతిని ప్రేమించి, ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు – నాలుగేళ్ల కుమారుడు తారక్‌రామ్, రెండేళ్ల కుమార్తె మహి ఉన్నారు. మురళి తండ్రికి స్కిన్ క్యాన్సర్ సోకడంతో బెంగళూరులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స సాగుతోంది. ఇందుకోసం ఆయన రూ.30 లక్షల దాకా అప్పు చేశారు. ఈ నేపథ్యంలో చెల్లి పెళ్లి బాధ్యత, పిల్లల భవిష్యత్తు, కుటుంబ భాద్యతలు మురళిపై తీవ్ర ఒత్తిడిగా మారాయి.
అదే సమయంలో నాలుగు నెలల క్రితం, మిత్రుడు తీసుకెళ్లిన మురళి కారు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణించాడు. కేసు రాజీ అయ్యేందుకు మృతుడి కుటుంబం రూ.15 లక్షలు డిమాండ్ చేసింది. మురళి దగ్గరున్న రూ.4 లక్షల్ని అప్పగించాల్సి వచ్చింది. మొత్తం రూ.34 లక్షల వరకు అప్పుల్లో చిక్కుకున్నారు. అనూహ్యంగా ఆదివారం రాత్రి, తన భార్యతో మాట్లాడిన క్షణాల తరువాతే మురళి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల ఒత్తిడి కారణంగానే ఆయన నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు. నేడు శివపురంకొట్టాలలో మురళి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.






