- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాల ఫ్యాక్షన్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు: 12 మందికి యావజ్జీవ శిక్ష
దశాబ్ద కాలం క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాను వణికించిన ఇంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: దశాబ్ద కాలం క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాను వణికించిన ఇంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘోరంలో పాలుపంచుకున్న 12 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో జరిగిన ఈ నలుగురి హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేకూరింది. వివరాల్లోకి వెళితే.. 2012వ సంవత్సరంలో రాజకీయ కక్షలు, పాత పగలతో నంద్యాల సమీపంలోని ఇంజేడు గ్రామానికి చెందిన కీలక నేత ఇంజేడు కృష్ణారెడ్డిని ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు, బంధువులైన మరో ముగ్గురిని అత్యంత కిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ దారుణ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాక్షన్ సెగలు రేగాయి.
అయితే.. ఈ కేసులో పోలీసులు మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. 2012 నుండి సుమారు 14 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సాగింది. ఈ గ్యాప్‌లో నిందితుల్లో నలుగురు వివిధ కారణాలతో మరణించారు. మిగిలిన వారిలో 12 మందిపై మోపిన నేరాలు రుజువు కావడంతో, న్యాయమూర్తి వారికి జీవితఖైదు (యావజ్జీవ శిక్ష) విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో ఇద్దరికి సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారిని విడుదల చేసినట్లు సమాచారం. తీర్పు వెలువడే సమయానికి కోర్టు ప్రాంగణం వద్ద మరియు ఇంజేడు గ్రామ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం కావడంతో పాత కక్షలు మళ్లీ రాజుకోకుండా డ్రోన్లతో నిఘా ఉంచారు.






