తిరుమల కొండపై ఫోటో షూట్ వివాదం.. క్ష‌మాప‌ణ‌లు కోరిన జంట‌

by Ramesh Naini |

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫోటో షూట్‌పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

తిరుమల కొండపై ఫోటో షూట్ వివాదం.. క్ష‌మాప‌ణ‌లు కోరిన జంట‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫోటో షూట్‌పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్లమండపానికి అతి సమీపంలో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ప్రత్యేక లైట్ల వెలుగులో ఈ ఫోటో షూట్ జరగ్గా.. నుదుటిపై ముద్దులు పెట్టుకుంటుండగా వీడియోలు, ఫొటోలు తీశారు. అలాగే గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు నడస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, భక్తులు మండిపడ్డారు. తిరుమలలో ఫోటోషూట్, రీల్స్ చేయడం నిషేధం. అయినప్పటికీ కొంతమంది ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని విమర్శలు వచ్చాయి.

అయితే, ఫోటో షూట్ వివాదం కావడంతో తాజాగా ఆ నూతన జంట స్పందించింది. క్ష‌మాప‌ణ‌లు కోరుతూ తమిళనాడు, తిరువన్నమలై చెందిన జంట తిరుమల్, గాయత్రి దంపతులు తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. టీటీడీ కళ్యాణ వేదికలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే గుడి ప్రాంగణంలో ఫోటోలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అక్కడ ఫొటోలు దిగడం నిషేధం అని తమకు తెలియదని ఆవేదన చెందారు. ఇకపై అలాంటి తప్పు చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ వీడియోలు, ఫోటోలను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. తెలియక తప్పు చేశామని, మమ్మల్ని క్షమించండి అని కోరారు. శ్రీవారికి సేవ చేసి తమ తప్పును సరిచేసుకుంటామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story