- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. అధికార పార్టీకి టచ్‌లో కార్పొరేటర్లు..
కాకినాడ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి/తుని: కాకినాడ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా ఆధ్యక్షుడుగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా, తునికి చెందిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను కాకినాడ జిల్లా ఆధ్యక్షుడుగా పార్టీ కేంద్ర కార్యాలయం నియమించిన కొద్ది రోజులకే జరిగిన ఈ పరిణామాలు వైసీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు.
మొత్తం 13 మంది కౌన్సిలర్లు..
పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన తుని పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నికలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే తుని పట్టణానికి చెందిన ముగ్గురు మహిళా వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా శనివారం అదే పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మెుత్తం 13 మంది కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు అయ్యింది. వీరందరికీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైస్ చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్లకు గేలం వేస్తున్న టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
వైసీపీ శ్రేణుల్లో నిరాశ..
తుని మున్సిపాలిటీలో 30 వార్డులకు 30 గెలిచిన వైసీపీ ప్రస్తుతం వారిని నిలబెట్టుకోవటంలో విఫల మవుతోంది. ఇందులో ఒకరు చనిపోగా, మరొకరు వైసీపీకి రాజీనామా చేయగా ప్రస్తుతం 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో అత్యధిక కౌన్సిలర్లు టీడీపీలో చేరగా, మిగిలిన వారంతా టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వైసీపీకి అనుకూలంగా ప్రస్తుతం 14 మంది కౌన్సిలర్లు ఉండగా, వైస్ చైర్మన్ పదవికి 15 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఇటు టీడీపీ, అటు వైసీపీ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. త్వరలో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇంత మంది వైసీపీని వీడడంపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. జిల్లాకు చెందిన మరికొంతమంది ముఖ్య నేతలు సైతం కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సీనియర్ నాయకులు దూరంగా ఉండటం, పార్టీకి దిశానిర్దేశం కరవవ్వటంతో వైకాపా శ్రేణులు నిర్వేదంలో ఉన్నాయి.






