- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు.. తాళలేక సీఎం చంద్రబాబుకు లేఖ
పెండింగ్ బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్లు లేఖ రాశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ నిర్మాణాల్లో గుత్తేదారుల పాత్ర కీలకం. ఎక్కడ నిర్మాణాల చేయాలన్నా కాంట్రాక్ట్ పద్ధతిలోనే వారికి పనులు అప్పగించాల్సిందే. అలా నిర్మాణాలకు కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు. కొటేషన్ ప్రకారం పనులు దక్కించుకుంటారు. తొలుత పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఇలాంటి కాంట్రాక్టర్లు ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు పూర్తి చేసి ఆరేళ్లయినా ప్రభుత్వం ఇంకా డబ్బులు చెల్లించలేదు. దీంతో కుటుంబ పోషణ భారం అయింది. పైగా తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారు. ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన చెందుతున్నారు.
కాగా 2014-19 హయాంలో రాష్ట్రంలో చేపట్టిన పలు నిర్మాణ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లుకు ప్రభుత్వం అప్పగించింది. అనుకున్న సమయంలో ఆ పనులు పూర్తి అయ్యాయి. అయితే కాంట్రాక్టర్లకు కొంత డబ్బులు చెల్లించింది. మిగిలిన మొత్తం చెల్లిద్దామనుకునే సరికి ఎన్నికలు వచ్చాయి. దీంతో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం, వైసీపీ గవర్నమెంట్ పాలన సాగింది. అయితే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. ఐదేళ్ల పాటు నరకం అనుభవించారు.
అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో వారి ఆశలకు రెక్కలొచ్చాయి. పెండింగ్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందనే ఆశ పెట్టుకున్నారు. అలా సంవత్సరం గడిచిపోయింది. ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో తమ సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతుందని భావించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు తాజాగా లేఖ రాశారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని ఏపీబీసీఏ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సూర్య ప్రకాశ్ లేఖ రాశారు. ఆరేళ్లుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.






