విజయవాడలో తెప్పోత్సవంపై సందిగ్ధత.. అయోమయంలో భక్తులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-01 07:50:26  IST  )

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 10వ రోజు మహానవమి సందర్భంగా దుర్గమ్మవారు భక్తులకు మహిషాసురమర్దిని దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు.

విజయవాడలో తెప్పోత్సవంపై సందిగ్ధత.. అయోమయంలో భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 10వ రోజు మహానవమి సందర్భంగా దుర్గమ్మవారు భక్తులకు మహిషాసురమర్దిని దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. కాగా.. రేపు విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. విజయదశమి రోజున సాయంత్రం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. హంస వాహనంపై విహరిస్తారు. అయితే కృష్ణానదికి ఇప్పటికే వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుంచి 6,80,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అధికారులు అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవం నిర్వహిస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. దాదాపుగా స్వామి అమ్మవార్ల నది విహారం రద్దవుతుందని సమాచారం. నదివద్దే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి ఇంకా స్పష్టత లేకపోవడంతో.. భక్తుల్లో అయోమయం నెలకొంది. ప్రతి ఏటా విజయదశమినాడు నిర్వహించే తెప్పోత్సవాన్ని విద్యుత్ దీపాల వెలుగుల్లో చూసేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. కాగా.. గతేడాది కూడా భారీ వర్షాల కారణంగా దుర్గామల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం రద్దు చేయడంతో భక్తులు నిరాశ చెందారు. కాగా.. నేడు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అమ్మవారిని 55 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

Next Story