- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైలవరం టీడీపీలో గందరగోళం.. కొలిక్కిరాని ఎమ్మెల్యే టికెట్ల వ్యవహారం
ఇద్దరు కొట్టుకుంటే మూడవ వాడికి లాభం అన్నచందంగా మారింది మైలవరం టీడీపీ టిక్కెట్ల వ్యవహారం.

దిశ ప్రతినిధి, విజయవాడ: ఇద్దరు కొట్టుకుంటే మూడవ వాడికి లాభం అన్నచందంగా మారింది మైలవరం టీడీపీ టిక్కెట్ల వ్యవహారం. నిన్నటిదాకా తమ లీడర్ దేవినేని అనే నమ్మకంలో ఉన్న ద్వితీయ శ్రేణి కేడర్ సడన్‌గా వసంతకు జేజేలు కొట్టమంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో పడ్డారు. అందుకు కారణాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీల పైన అట్రాసిటీ కేసులు పెట్టించిన వైసీపీపై టీడీపీ బీసీలు గుర్రుగా ఉన్నారు. కేసులు పెట్టించిన దానిలో తన పాత్ర లేదంటున్న వసంత ఆ రోజు గొడవ జరిగిన సమయంలో అక్కడే ఉన్నారనేది తెలుగు తమ్ముళ్ల వాదన. ఆయా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలను పోగేసుకుని సున్నంపాడు, జి.కొండూరులకు తరలించడంలో వసంత ఇంచార్జిలు కీలక పాత్ర పోషించారనేది వాస్తవం కూడానూ. దీంతో వసంతను తెచ్చి తమ గుండెలపైన నిప్పుల కుంపటిలాగా పెట్టవద్దంటూ తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. కానీ పెద్దోళ్ల రాజకీయాల ముందు సామాన్య కార్యకర్త గోడు వినేవారుండరు అనే సత్యం వీరికి అర్థం అయ్యే సరికి వీరిచేతిలోని జెండా వీరి పిల్లల చేతిలో ఉంటుదంనేది వాస్తవం అయినా వారు ససేమిరా ఒప్పుకోరు.
వసంత వర్సెస్ దేవినేని..
మైలవరంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా రగులున్న వసంత, దేవినేనిల ఎమ్మెల్యే టిక్కెట్ వివాదం ముదిరి పాకాన పడుతోంది. చివరకు వసంత టిడిపిలో చేరినా కూడా ఆయన మీద క్రింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు అయిష్టం ఇంకా తగ్గలేదు. ఈ విషయాన్ని నిరూపించడం కోసం దేశం శ్రేణులు వసంతను ఒక తోడేలుతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించడం చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడంలేదు. ఇప్పటికే ఆశ చూపి వసంతకు కాదంటే ఆయనను నమ్ముకుని పార్టీలో చేరిన అనుచర గణం దేవినేని కోసం పనిచేస్తుందా? అంటే అనుమానమే. పోనీ వసంతకే పట్టం కడితే తోడేలు అంటూ పోస్టులు పెట్టిన వారు జిందాబాద్ లు కొడతారా? అనేది కూడా అనుమానమే. దీంతో మైలవరంలో మరోసారి తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూడక తప్పదనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రేసులో అక్కల గాంధీ..
ఈ సందిగ్దాల నడుమ అసలు ఆ ఇద్దరికీ కాకుండా టిడిపి జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థికి కనుక మైలవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే అన్ని వివాదాలకు తెరపడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా నియోజవర్గంలో స్థానికుడు ఎటువంటి అవినీతి ఆరోపణలు వివాదాలు లేని, నాయకుడిగా పేరు తెచ్చుకున్న అక్కల గాంధీకి అటు కాపు సామాజిక వర్గంతో పాటు బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీల మద్దతు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల జనసేన పార్టీ చేయించిన సర్వేలో అక్కల గాంధీ పేరు బాగా వినిపించినట్లు స్వయానా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు తెలుస్తోంది. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ వసంతకు కేటాయిస్తారా? దేవినేనికి కేటాయిస్తారా, లేక జనసేన పొత్తులో భాగంగా అక్కల గాంధీకి కేటాయిస్తారా...? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.






