ఘాట్ బోట్ల వద్ద బైరెడ్డి, మాండ్ర వర్గీయుల మధ్య విభేదాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ, కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఏపీలో ఏడు నదులు కలిసే సంగమ తీరంతో పాటు ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన సంగమేశ్వరాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు వస్తుంటారు.

ఘాట్ బోట్ల వద్ద బైరెడ్డి, మాండ్ర వర్గీయుల మధ్య విభేదాలు
X

దిశ, కర్నూలు ప్రతినిధి : తెలంగాణ, కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఏపీలో ఏడు నదులు కలిసే సంగమ తీరంతో పాటు ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన సంగమేశ్వరాన్ని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్ది, మాండ్ర వర్గీయుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ప్రస్తుతం బోట్లు తిరగడం లేదు. పర్యాటకం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇరువర్గాల ఆధిపత్యం కారణంగా బోట్ల పంచాయితీ కొలిక్కిరావడం లేదని తెలుస్తుంది. ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన నంద్యాల జిల్లా పరిధిలోని సిద్దేశ్వరం-సోమశిల ప్రాంతాల మధ్య ఉన్న కృష్ణానదిని దాటించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఘాట్ బోట్ల నిర్వాహకులు ఒప్పందం చేసుకొని నిర్వహణ చేపట్టేవారు. అందుకు సోమశిలలో ఘాట్ బోట్ కోసం ఏడాదికోసారి వేలం నిర్వహిస్తారు. అయితే తెలంగాణ బోట్ల నిర్వాహకులు కొంతమందికి లైసెన్స్ ఉంటే, ఏపీలోని సిద్దేశ్వరం, సంగమేశ్వరం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులకు లైసెన్స్ లేవు. అయినా పరస్పర సహకారంతో బోట్లు తిప్పుకునేవారు.

వైరం కారణంగా..

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, నంద్యాల పార్లమెంట్ మాజీ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి వర్గీయుల మధ్య వైరం నడుస్తోంది. ఇటీవల ఇరువర్గాలు చెరు 15 రోజులు బోట్లు తిప్పుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు, మూడు నెలల పాటు బాగానే ఉన్నా, సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోట్లు తిప్పుకోవాలని ఏడాదిన్నర క్రితం జిల్లా అధికారులు ఆదేశించారు. ఏపీ నిర్వాహకులకు లైసెన్సులు లేకపోవడంతో బోట్లు నిలిచిపోయాయి.

తెలంగాణ బోట్లకూ హెచ్చరికలు

సిద్దేశ్వరం-సోమశిల ఘాట్ బోట్ల పంచాయతీ నేపథ్యంలో తెలంగాణ బోటు నిర్వాహకులకు ఏపీకి చెందిన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల ఎస్ఐ, తహసీల్దార్లు అనుమతి లేకుండా, లైసెన్స్ లేకుండా బోట్లు తిప్పితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. గతంలో బోట్లు సీజ్ చేసి వారి నుంచి లక్షల్లో వసూలు చేసిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ర్ట ప్రాంతాల నుంచి ఉమ్మడి ఏపీలో చారిత్రక నేపథ్యం కలిగిన, ఏడు నదులు కలిసే, పాండవులు వనవాసం చేసిన ప్రాంతమైన సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అయితే తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సోమశిల ఘాట్ బోట్ల వద్దకు వస్తున్నారు. అక్కడి వారు తాము అవతలి ఒడ్డున దింపేందుకు తమకు అనుమతి లేదని చెప్పడంతో రోజుకు 50 నుంచి 60 మంది వెనుదిరుగుతున్నారు. ఇలా ఎలాంటి శుభకార్యాలకు, వివిధ పనుల నిమిత్తం వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడంలేదు. 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే కొల్లాపూర్, పెంట్లవెళ్లి, నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి, లింగాల, అమరగిరి వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఆత్మకూరు, కర్నూలు మీదుగా దాదాపు 120 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తే ఆయా ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Next Story