- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఏడాదిలో స్క్రబ్ టైఫస్ కేసుల ఆందోళన
ప్రజారోగ్య పరిరక్షణ పట్ల మొదలైన ఆందోళనలు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్త ఏడాది (2026) ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 మందికి ఈ వ్యాధి సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ముఖ్యంగా పచ్చిక బయళ్ళు, పొలాలు, పొదల్లో ఉండే 'చిగ్గర్ మైట్స్' అనే సూక్ష్మ కీటకాలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ ఏడాది నమోదైన 144 కేసుల్లో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరణించిన వారిలో అనకాపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు ఉండగా, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ జ్వరాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రధానంగా 'ఒరియెంటియా సూసుగముషి' అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ (Eschar) ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దీనితో పాటు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఇది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడుపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొలాల్లో పనిచేసే వారు, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే వారు తప్పనిసరిగా ఒళ్లంతా కప్పేలా దుస్తులు ధరించాలని చెబుతున్నారు. అదే విధంగా కాళ్ళకు బూట్లు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఎలిసా (ELISA) పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.






