Coconut: కొబ్బరి కాయలను ఎందుకు గౌరవిస్తారు?.. అసలు ఎన్ని రకాలు, వాటి ధరలెంతో తెలుసా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-20 16:08:20  IST  )

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మహాభాగ్యం అని చెబుతారు..

Coconut: కొబ్బరి కాయలను ఎందుకు గౌరవిస్తారు?.. అసలు ఎన్ని రకాలు, వాటి ధరలెంతో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: కొబ్బరి నీళ్లు(Coconut Water) ఆరోగ్యానికి మహాభాగ్యం అని చెబుతారు. తాగితే ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేస్తుందని చెబుతారు. వేసవి వస్తే కొబ్బరి లీటర్ల కొద్ది నీళ్లు తాగేస్తాం. అంతేకాదు కొబ్బరి చెట్టు(Coconut Tree)లోని ప్రతిభాగం మనకు పనికొస్తుంది. నీళ్లు, కలప, క్రీమ్, కొబ్బరి, పీచు మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అన్ని శుభ, మతపరమైన కార్యక్రమాల్లోనూ కొబ్బరికాయలు వినియోగిస్తారు. అందకే కొబ్బరిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. అయితే కొబ్బరి చెట్టుకు కాసే కాయల్లో 9 రకాలు ఉన్నాయి. కొత్త కొబ్బరి కురిడీ, పాత కాయ గండేరా, పాతయకాయ గటగట, కొత్త కాయ గండేరా, కొత్తకాయ గటగట, నీటి కాయ, పాత ముక్కుడు కాయ, కొత్త పచ్చి కాయ, కొత్త పచ్చి కాయగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి కాయ అనగానే ముందుగా గుర్తుకు వచ్చిది కోనసీమ. కొబ్బరి చెట్లు అధికంగా ఉండటంతో కొబ్బరి కాయలు కూడా భారీగా పండుతున్నాయి. సంవత్సరం పొడుగునా ఒక కొబ్బరి చెట్టుకు 150 నుంచి 250 కాయలు వరకూ కాస్తాయి.

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

ఈ కొబ్బరి కాయలను ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు ఎగుమతి చేసి అమ్ముతారు. హైదరాబాద్‌లో ఎక్కువగా కోనసీమ కొబ్బరి కాయలే కనిపిస్తుంటాయి. ఎండు కొబ్బరి నుంచి నూనెను తీసి విక్రయిస్తారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో అతి పెద్ద కొబ్బరికాయల మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంటాయి. తాజాగా ఈ మార్కెట్‌లో కొబ్బరి కాయల ధరలు ఇలా ఉన్నాయి. కొత్త కొబ్బరి కురడీ వెయ్యి కాయల ధర రూ.14 వేలు, పాత కాయ గండేరా రూ.18 వేలు, పాత కాయ గటగట రూ. 17 వేలు, కొత్తకాయ గండేరా రూ. 17 వేలు, కొత్తకాయ గటగట రూ.16 వేలు, నీటి కాయ పాత ముక్కుడు రూ.14 వేల నుంచి రూ.15 వేలు, కొత్త కాయ పచ్చి రూ. 13 వేల నుంచి రూ. 14 వేలు, కొబ్బరి నూనె 15 కిలోలు రూ. 3,750, కిలో రూ.250కి అమ్ముతున్నారు. అయితే ఈ కొబ్బరి కాయల ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు.

Next Story