అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2025-10-25 08:48:50  IST  )

అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది.

అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో రాజకీయలకు, రాజీకి తావుండదు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) స్పష్టం చేశారు. అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కూడా అటవీ భూములను రక్షించే విషయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని ఎన్డీఎంఏ (NDMA) ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అటవీ శాఖ సిబ్బంది కొరతను అధిగమించడానికి ఉన్న మార్గాలను కేబినెట్ ముందుంచామన్నారు. నియామకంలో ఎలాంటి సిఫార్సులకు తావివ్వొద్దన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఇబ్బందిపెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం భూ భాగంలో నోటిఫై చేసిన అడవులు (Notified Forests) ఉన్నాయని పేర్కొన్నారు. డి-నోటిఫై చేసిన దానితో కలిపితే మొత్తం 31 శాతంగా ఉండవచ్చు అని అంచనా వేశారు. అయితే ఉన్న అడవుల్లో ఎంత పచ్చదనం ఉంది? ఆక్రమణల నేపథ్యంలో ఎంత శాతం అడవులు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీనిపై సమగ్ర సర్వే (Survey) చేసి ఇతర శాఖలను సమన్వయం చేసుకుని అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా, చేసింది ఎవరైనా ఉపేక్షించవద్దన్నారు. అడవుల సంరక్షణ, ప్రకృతి (Nature) పరిరక్షణ, గిరిజనుల కోసం ఏదైనా చేయాలన్న తపన, నిబద్దతతో పని చేయాలని ముందుకు వచ్చే అధికారులకు కూటమి ప్రభుత్వం తరఫున మావంతు సహకారం అందిస్తుందని హామీనిచ్చారు. అడవులను కాపాడుకుంటూ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుంటూ పచ్చని హరితాంధ్రప్రదేశ్ (Haritha Andhra Pradesh) నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

Next Story