పిన్నెల్లి సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు.. జంట హత్యల కేసుపై వైసీపీ ఆరోపణలు

by Ramesh Naini |

పిన్నెల్లి సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందని వైఎస్ఆర్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.

పిన్నెల్లి సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు.. జంట హత్యల కేసుపై వైసీపీ ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పిన్నెల్లి సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందని వైఎస్ఆర్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. పల్నాడు జిల్లా, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని జంట హత్యల కేసులో ఇరికించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుందని ఆరోపించింది. హత్యలకు కారణం టీడీపీలోని ఆధిపత్య పోరే అని సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ ఎలాంటి సంబంధం లేని కేసులో వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని ఇరికించే కుట్ర చేస్తున్నారని తెలిపారు. అధికారం అడ్డం పెట్టుకుని వేధింపులా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించింది. తప్పుడు కేసులతో భయపెట్టలేరని చంద్రబాబు నాయుడికి ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది.

కాగా, పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మే 24 వ తేదీన జరిగిన టీడీపీ నేతలు జె.వెంకటేశ్వర్లు, జె.కోటేశ్వరరావుల హత్య కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఆగస్టు 29న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు వారిని రెండు వారాల్లోగా లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశించింది.

Next Story