విద్యుత్ చార్జీలపై కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలు హాస్యాస్పదం : షర్మిల

by Thanuru Gopichand |

విద్యుత్ చార్జీలపై (Electricity Charges) కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) అన్నారు.

విద్యుత్ చార్జీలపై కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలు హాస్యాస్పదం : షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యుత్ చార్జీలపై (Electricity Charges) కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న అధిక విద్యుత్ ఛార్జీల భారంపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో తన నిరసనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఇచ్చారు. విద్యుత్ బిల్లుల మోతతో ప్రజలకు కరెంటు షాక్‌లు ఇస్తూ, సర్దుబాటు (ట్రూ అప్) పేరుతో గుండెపోటు తెప్పిస్తోందని షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 17 నెలల కూటమి పాలనలో ప్రజలపై మోపిన అధిక చార్జీల భారం అక్షరాలా రూ.15,485 కోట్లు అని అన్నారు. వచ్చే రెండేళ్ల పాటు ఈ ట్రూ అప్ భారం ప్రజల నెత్తిన పెనుభారంగా మారనుందని పేర్కొన్నారు. యూనిట్‌కు అదనంగా 40 పైసలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తూ, 'ఛార్జీలు పెంచను... మాట మీద కట్టుబడి ఉన్నాను' అని చంద్రబాబు చెప్పడం ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్! అని అన్నారు. ఇది మాట మీద కట్టుబడి ఉండటం కాదు అని, ప్రజలను మోసం చేయడమే!" అని వైఎస్ షర్మిల తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు.

సీఎం​చంద్రబాబు నాయుడు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడాలన్నా, కూటమి ప్రభుత్వానికి ఛార్జీల భారం ప్రజలపై పడొద్దని చిత్తశుద్ధి ఉన్నా, తక్షణమే మూడు డిమాండ్లు అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు. సర్దుబాటు భారం రూ.15,485 కోట్లను వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ట్రూ అప్ పేరుతో ఇప్పటి వరకు వసూలు చేసిన రూ.3,000 కోట్లను ప్రజలకు 'ట్రూ డౌన్' రూపంలో తిరిగి చెల్లించాలన్నారు. ప్రస్తుతం​అమలవుతున్న ఛార్జీలలో 30 శాతం తగ్గింపును వెంటనే అమలు చేసి ప్రజలకు ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనంగా భారం మోపకుండా, ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని వైఎస్ షర్మిల అన్నారు. లేదంటే ప్రజల పక్షాన పోరాటాలకు తాము వెనకాడబోమని తెలిపారు.

Next Story