- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : బ్రిటీషర్లకు సింహ స్వప్నంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Nethaji Subasha Chandra Bose) జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఘన నివాళులను అర్పిస్తున్నారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛను ఇస్తానని నేతాజీ ఇచ్చిన నినాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన పోరాటాన్ని, చూపిన ధీరత్వాన్ని, త్యాగాలను స్మరించుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నేతాజీకి ఘన నివాళులను అర్పించి ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
సీఎం చంద్రబాబు నాయుడు
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని సీఎం (Chandra Babu Naidu) కొనియాడారు. ఆయనకు 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈనాటికీ నేతాజీ చేసిన పోరాటాన్ని చెప్పుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకతని తెలిపారు. భారత జాతి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతానని ప్రతిజ్ఞ చేసి కార్యాచరణలో చూపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు సదా స్మరణీయుడని తెలిపారు.
మంత్రి నారా లోకేశ్
ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతదేశ స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ నేతాజీ స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పరాక్రమ్ దివస్ ను పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకులు నేతాజీ సుభాస్ చంద్రబోస్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఘన నివాళులు అర్పించారు. బెదురు బెరుకు లేని నేతాజీ నాయకత్వంలో బ్రిటీష్ సామ్రాజ్యం గడగడలాడిందని డిప్యూటీ సీఎం తెలిపారు. నేతాజీ ధైర్యం, మాతృభూమి పట్ల ఎనలేని ప్రేమ తరతరాలు భారతీయుల్లో దేశభక్తిని పెంపొందిస్తాయని అన్నారు.






