‘కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-01 04:28:20  IST  )

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

‘కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందన్నారు. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమని సీఎం పేర్కొన్నారు.

కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా, కష్టజీవుల ప్రభుత్వం గా ఉంటుందని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మంత్రి నారా లోకేష్..

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా కార్మికులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మే డే అని పేర్కొన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు. కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు, కర్షకులు అభ్యున్నతికి కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కార్మిక సోదర, సోదరీమణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story