- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక సందేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పుట్టిన రోజు (Birthday) సందర్భంగా రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు (Wishes) వెల్లువెత్తాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పుట్టిన రోజు (Birthday) సందర్భంగా రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు (Wishes) వెల్లువెత్తాయి. దీనిపై సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు విషెస్ చెప్పినవారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కీలక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగిందని, ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.
అలాగే 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం.. అపురూప అవకాశం అని అన్నారు. అంతేగాక మీ ఆదరాభిమానాలు, నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయని, తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారని, మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని సీఎం మాటిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని నా జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఇక స్వర్ణాంధ్ర-2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం అని, మీ మద్దతుతో, మీ సహకారంతో, సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తానని చెప్పారు. నా ప్రతీ అడుగు, నా ప్రతీ ఆలోచన, ప్రతీ కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమేనని, అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆవిష్కరణలకు, అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది నా తపన అంటూ.. ‘థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందామని వివరించారు.
సమాజంలో అసమానతలు పోవాలి.. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి.. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే నా సంకల్పం అని అన్నారు. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మూడు దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ సమాజంలో ఎంతో మార్పుతెచ్చిందని, ఈసారి తీసుకువచ్చిన ‘పీ4’తో రాష్ట్రంలో పేద కుటుంబాలను.. స్వర్ణ కుటుంబాలుగా చేయాలనేది నా ప్రయత్నం అని తెలిపారు. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలి అని, వ్యక్తి శ్రేయస్సే.. సమాజ శ్రేయస్సుగా నేను విశ్వసిస్తానని, జనం మన బలం.. జనాభా సమర్ధ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని, అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందువరుసన ఉన్నామని తెలియజేశారు.
మనం కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని తిరుగులేని విజయాలు సాధించగలమని, 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే నా అభిలాష అని తన కోరికను వ్యక్తపరిచారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉందని, దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదామని, నాతో పాటు, అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ, విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, అందరికీ టీడీపీ అధినేత మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.






