"ప్రజలను ఇబ్బంది పెడితే అనుమతులు కట్" : ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు సీరియస్ హెచ్చరిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-26 15:48:49  IST  )

రాష్ట్రంలో ఇంధన కొరత నెలకొనడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను ఇబ్బంది పెడితే అనుమతులు కట్ : ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు సీరియస్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంధన కొరతపై అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడంపై HPCL, IOCL , BPCL ప్రతినిధులను ఆయన నేరుగా ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.

నివేదికలు వద్దు, ఫలితాలు కావాలి!

సమావేశంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సాంకేతిక అంశాలు , అంతర్గత విధానాల గురించి వివరిస్తూ నివేదికలు సమర్పించేందుకు ప్రయత్నించగా, సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చారు. "నాకు నివేదికలు వద్దు, క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలి. బంకులకు ఇంధన సరఫరా సజావుగా సాగాలి" అని ఆయన కరాఖండిగా చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలకుండా క్రెడిట్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

అనుమతులపై పునరాలోచన

ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుంటూ, అవసరమైన సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కంపెనీలు తమ మొండి వైఖరిని వీడకపోతే, రాష్ట్రంలో వారు నడుపుతున్న కార్యకలాపాలకు సంబంధించిన అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అవసరమైతే అనుమతులను పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. రేపటిలోగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సప్లై పెరగాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యను చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రతీ బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని, బ్లాక్ లో అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, తెల్లారేసరికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Next Story