- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింఛన్లతో గ్రామాలు కళకళ.. చులకనగా చూస్తే తోలు తీస్తా : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు ఉద్యోగులు సమయానికి జీతాలు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్/డైనమిక్ బ్యూరో : గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు ఉద్యోగులు సమయానికి జీతాలు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్, తాను మాట ఇచ్చామని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామన్నారు. సీఎం పదవి తనకేం కొత్త కాదని, అందరికంటే ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏడాది పట్టిందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడా తక్కువ చేయకుండా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే అర్హులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ప్రతి నెలా పెన్షన్లకు రూ.2750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కేవలం రూ.200 మాత్రమే పెన్షన్ పెంచితే.. తాము అధికారంలోకి రాగానే పెన్షన్ ను రూ.4 వేలకు పెంచామని గుర్తుచేశారు.
ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే సిస్టమ్ ను కూడా అప్డేట్ చేశామని, ఎక్కడైతే పెన్షన్ ఇస్తారో అక్కడ ఆటోమెటిక్ గా సెంట్రల్ కంప్యూటింగ్ సిస్టమ్ కు డేటా వస్తుందన్నారు. పెన్షన్ ఏ టైమ్ లో ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఇవన్నీ రికార్డులో వస్తాయన్నారు. పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టమని ప్రతి ఒక్క ఉద్యోగికి ఆదేశాలు ఇచ్చామన్నారు. పెన్షన్లను సేవాభావంతో పంపిణీ చేయాలని, అది పవిత్రమైన సర్వీస్ అని చెప్పారు. అందుకే ఈ నెల నుంచి పర్సనలైజ్డ్ వాయిస్ మెసేజ్ పంపుతున్నామని, మీ పేరుతో ఎంత డబ్బు పెన్షన్ ఇచ్చామో మెసేజ్ వస్తుందని, ఒకవేళ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదని మెసేజ్ వస్తుందన్నారు. పెన్షన్ తీసుకునే అర్హత ఉన్నవారు దానిని మిస్ కావొద్దన్న ఉద్దేశంతోనే ఈ సిస్టమ్ తీసుకొచ్చామన్నారు. ఇక పెన్షన్ తీసుకునే భర్త చనిపోయిన భార్యలకు ఆటోమెటిక్ గా వితంతు పెన్షన్ ను మంజూరు చేస్తున్నామన్నారు. 3నెలల పాటు పెన్షన్లు తీసుకోని వారికి మొత్తం ఒకేసారి ఇచ్చే ఏర్పాటు కూడా చేశామన్నారు.
ఇక తల్లికి వందనంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నామని, ఈ పథకం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రైతులకు కూడా ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. వారికి నచ్చిన మిల్లులోనే ధాన్యాన్ని కొనేలా ప్రణాళికలు చేసి చూపించామని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. యోగాలో మనకు రెండు గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ రికార్డులు వచ్చాయన్నారు. రాజకీయ ముసుగులో ప్రజాధనం దుర్వినియోగం సబబు కాదన్నారు.
పొలిటికల్ గవర్నెన్స్ ను వారసత్వంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాలపై యువత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మితే తాట తీస్తామని, వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. గంజాయి, డ్రగ్స్ కు బానిసలవుతున్నవారు చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారని, తమ ఆడబిడ్డపై చెయ్యి వేసినవాడికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేసేవారిని పట్టుకునేందుకు అధునాతన టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి నిందితుల్ని పట్టుకునేలా ఏర్పాట్లు చేసే బాధ్యత తమదని పోలీస్ వ్యవస్థకు హామీ ఇచ్చారు.






