అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. చెల్లింపులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. చెల్లింపులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. సంబంధిత అధికారులతో సమావేశమైన ఆయన.. బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు. ఆరునెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అగ్రిగోల్డ్ బాధితులు 11.5 లక్షలకు పైగా ఉన్నారని, 8 రాష్ట్రాల్లో కలిపి సుమారు 20లక్షల మంది ఉంటారని తెలిపారు. దీనిని బట్టి చూస్తే మనరాష్ట్రంలో బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. సీఐడీ పెద్దలు సైతం అగ్రిగోల్డ్ సొమ్ము తిన్నారని మండిపడ్డారు.

గతంలో వేలం వేయకుండా మిగిలిన ఆస్తుల్ని, లేదా వివాదాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల్ని గుర్తించి.. కోర్టు అనుమతితో ఆ ఆస్తుల్ని పారదర్శకంగా వేలం వేసి.. వచ్చిన నిధులను బాధితులకు పంపిణీ చేయాలని సూచించారు. 11.5 లక్షల మందికి పైగా ఉన్న బాధితుల వివరాలను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి.. అర్హులైనవారికి చెల్లింపులు జరిగేలా త్రిసభ్య కమిటీ చూడాలని సీఎం ఆదేశాల్లో పేర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువమంది సామాన్య, మధ్యతరగతి ప్రజలే ఉండటంతో.. చంద్రబాబు ఈ సమస్యను ప్రధాన అంశంగా తీసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వడ్డీతో సహా కనీసం, అసలు మొత్తాన్నీ త్వరగా అందించడమే ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.

Next Story