బంకుల వద్ద రద్దీ తగ్గాలి.. అవసరమైతే ఆ సిస్టమ్ పెట్టండి : సీఎం చంద్రబాబు ఆదేశం

by Naga Rani Yarlagadda |

పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ తగ్గాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు.

బంకుల వద్ద రద్దీ తగ్గాలి.. అవసరమైతే ఆ సిస్టమ్ పెట్టండి : సీఎం చంద్రబాబు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి చూడకుండా చర్యలు తీసుకోవాలని, రద్దీ ఎక్కువగా ఉన్న చోట పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైతే టోకెన్ లేదా స్లాట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.

ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచ్ ఎలా జరుగుతోందని సీఎం అడిగి తెలుసుకోగా.. రాత్రంతా ఇంధన పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా సాగిందని అధికారులు వివరించారు. నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ చేరేలా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని వారు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి 1,402 లోడ్ల ఇంధనాన్ని డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గత అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,173 కిలోలీటర్ల పెట్రోల్, 2,846 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయి. నిన్నటితో పోలిస్తే స్టాక్ లేని బంకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం రాష్ట్రంలోని కేవలం 432 బంకుల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇంధనం అందుబాటులో ఉందని అధికారులు స్పష్టం చేశారు.

నో స్టాక్ .. వాహనదారులకు షాక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను అతలాకుతలం చేస్తోంది. ప్రభుత్వం మరియు పౌరసరఫరాల శాఖ తగినన్ని నిల్వలు ఉన్నాయని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. నగరాల నుంచి గ్రామాల వరకు మెజారిటీ పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం అందుబాటులో ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. డీజిల్ కొరత కారణంగా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గంటల తరబడి వేచి చూసినా పెట్రోల్ దొరక్కపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Next Story