సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి.. నీటి వివాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాజాగా మరోసారి నీటి వివాదం తెరమీదకు వచ్చింది. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార ప్రతిపక్షాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు.

సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి.. నీటి వివాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాజాగా మరోసారి నీటి వివాదం (Water dispute) తెరమీదకు వచ్చింది. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార ప్రతిపక్షాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి పంపకాల విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్‌గా స్పందించారు. నదుల నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ప్రజల అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజావసరాల కోసం చేపట్టే ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు. నీరు అనేది రైతుల జీవితాలకు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశమని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన స్పష్టం చేశారు.

గతంలో గోదావరి జలాలను మంజీరాకు తరలిస్తున్నప్పుడు తాము ఏనాడూ అడ్డుకోలేదని, పొరుగు రాష్ట్ర అవసరాలను తాము గౌరవించామని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత పుష్కలంగా ఉందని, ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకోవడం పై దృష్టి పెట్టాలని సూచించారు. నీటి విషయంలో నేతలు పోటీపడి ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం, సవాళ్లు విసురుకోవడం ఇరు రాష్ట్రాల ఆరోగ్యకరమైన సంబంధాలకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు

ఈ అంశంపై ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, ఆ విద్వేషాలను చూసి ఆనందపడటం నాయకత్వ లక్షణం కాదని ఆయన చురకలు అంటించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ధోరణిని విడనాడి, వాస్తవ పరిస్థితులను గమనించాలని కోరారు. జల వనరుల వినియోగంపై అనవసర గొడవలు పక్కనపెట్టి, సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలనేది తమ అభిమతమని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.

Next Story