ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-29 07:12:38  IST  )

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు

ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chadrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మంగళగిరిలోని (Mangalagiri) టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించి, పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే, నేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడటం ప్రారంభించామన్నారు. నలుగురు ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి పలు సూచనలు చేసినట్ల సీఎం వెల్లడించారు. పార్టీకి, ప్రజలకు ఇబ్బందిగా మారితే ఎవరికైనా నమస్కారం చెబుతామని హెచ్చరించారు.

అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై (YS Jagan) విమర్శలు గుప్పించారు. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందని మండిపడ్డారు. ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. రాజకీయ ముసుగులో ఉగ్రవాదులు తిరుగుతున్నారని, అందుకు 2019 ఎన్నికలకు ముందు ఎంపీ వివేకా హత్య ఒక ఉదాహరణ అన్నారు. గుండెపోటుతో చనిపోయారంటే తొలుత తాను నమ్మినట్లు చెప్పారు. అయితే, పోస్టుమార్టంలో గొడ్డలివేటని తేలిందన్నారు. ఈ ఘటనలో అప్పుడే సరైనరీతిలో చర్యలు తీసుకుంటే ఓడిపోయేవాళ్లమా? అని ప్రశ్నించారు.

టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు. 'విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ప్రజలకు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. కేంద్రం మనకు బాగా సాయం చేస్తోంది. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పడం లేదు. ఇంకా చాలా పరిష్కరించాలి.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని పరిపాలన చేశాం. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యం' అని అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే ఏడాదిన్నరలో ఆ ప్రాజెక్టును పూర్తిచేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి జాతికి అంకితం చేస్తానని హామీ ఇచ్చారు.

Next Story