తలసేమియా చిన్నారులకు నిరంతర సేవలు.. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రస్థానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2026-02-15 13:07:04  IST  )

తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు.

తలసేమియా చిన్నారులకు నిరంతర సేవలు.. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రస్థానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్థానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పరితపించిన మహనీయుడు, అధికారం అంటే పేదల సేవ అని భావించిన నాయకుడు నందమూరి తారక రామారావు ఆశయాలను, సేవలను కొనసాగించేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్థానం సాగుతోందని పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించిన ఆయన బాటలో సేవలు కొనసాగిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని వెల్లడించారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సాయం వంటి కార్యక్రమాలతో ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యం అని కొనియాడారు.

నారా భువనేశ్వరికి అభినందనలు..

మహిళా సాధికారతలో, జీవనోపాధి కల్పనలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తున్నదని తెలిపారు. ప్రజలకు, కష్టాల్లో ఉన్నవారికి మరింత చేరువయ్యేలా ట్రస్ట్ సేవలను విస్తరిస్తూ.. అత్యంత సమర్థవంతమైన సేవలను ఇచ్చే సంస్థగా ట్రస్ట్‌ను నడుపుతున్న.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి, వారి బృందానికి అభినందనలు తెలియజేశారు. ట్రస్ట్ కార్యక్రమాలకు వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీమ వికాసం.చంద్రబాబుతోనే సాధ్యం..!

Next Story