26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-24 15:05:39  IST  )

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) త్వరలో సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) త్వరలో సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఆరు రోజుల పర్యటనలో సీఎం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, యాజమాన్యాలతో సమావేశమవుతారు.

దావోస్‌ (Davos)లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (World Economic Forum) సమావేశంలో పాల్గొన్న అనంతరం ఇది చంద్రబాబు రెండో విదేశీ పర్యటన. ‘‘బ్రాండ్‌ ఏపీ’’ని ప్రపంచానికి పరిచయం చేసి, పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానాలు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’ దృష్టికోణం, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలను ఆయన విదేశీ పెట్టుబడిదారుల ముందు ఉంచనున్నారు.

కీలక అంశాలపై చర్చ

చిన్న, పెద్ద పోర్టులు, ఎయిర్‌పోర్టులు, హైవేలు, హార్బర్లు, తీరప్రాంతం పరిధి (1053 కి.మీ), మానవ వనరుల లభ్యత, భూ అందుబాటుతో పాటు అనుసంధానత (కనెక్టివిటీ) వంటి కీలక అంశాలను కూడా చంద్రబాబు విదేశీ సంస్థల ముందు వివరించనున్నారు. ఈ పర్యటనలో పలువురు సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా సెమీకండక్టర్లు, ఎఇ, డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత ప్రాజెక్టులు వంటి రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు.

తెలుగు డయాస్పోరాతో సమావేశం

సింగపూర్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో సమావేశం ముఖ్యమంత్రికి పర్యటనలో తొలి కార్యక్రమంగా ఉండనుంది. 'తెలుగు డయాస్పోరా' సమావేశంలో ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వారికి వివరణ ఇచ్చి, ఆహ్వానించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 (P4) కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండేందుకు పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖపట్నంలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సును దృష్టిలో ఉంచుకొని, సింగపూర్‌ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు అక్కడి ప్రముఖులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అంతేకాక డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌ రంగాలపై జరగనున్న బిజినెస్ రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొనడంతో పాటు, బిజినెస్ రోడ్ షోలో హాజరవుతారు. సింగపూర్‌లోని ప్రముఖ మౌలిక వసతుల కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్‌లను సందర్శించి అధ్యయనం చేయనున్నారు.

Next Story