2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-26 11:03:11  IST  )

2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు..

2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 2 వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేదని చెప్పారు. నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదని తెలిపారు. కానీ విదేశీ పాలన, స్వాతంత్ర్యం వచ్చాక మనం చేసుకున్న కొన్ని పాలసీల వల్ల దేశం ఇబ్బంది పడిందన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. ఐటీ రెవల్యూషన్ అందిపుచుకున్నామని, వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.

ప్రతి జంట ముగ్గురు పిల్లలు కనాలని మోహన్ భగవత్ చెబుతున్నారని, తానూ అదే చెబుతున్నానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు మన జనాభానే ఆస్తిగా మారారు. కొన్ని దేశాలు వయోభారం సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. మనకు ఆ ఇబ్బంది లేదు. తిరుగులేని యువశక్తితో కూడిన దేశం మనది. ఈ సంపదే మన దేశాన్ని అగ్ర భాగంలో నిలుపుతుంది. భారతదేశం నెంబర్-1 స్థానంలోకి వెళ్లనున్న సందర్భంలోనే పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గే వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. గంగా-కావేరీ నదుల అనుసంధానం అనేది జరగాలి... అప్పుడు నీటి భద్రత కలుగుతుంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత దేశం ఛాంపియన్. దేశాభివృద్ధికి వాజ్ పేయి పునాదులు వేశారు... ఇప్పుడు ప్రధాని నరేంద్ర అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. వినూత్న ఆలోచనలు చేయాలి... కొత్త ఆవిష్కరణలు చేపట్టాలి. భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్‌గా మారబోతోంది. ఇదే సమయంలో దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రత్యేకంగా నిలబట్టేంది మన విలువలు, సంప్రదాయాలే. ఆ దిశగా మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు. విలువలు, నైతికత వంటి అంశాలను పెంపొందించేందుకు మోహన్ భగవత్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. భారతదేశంలో అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది. అందరికీ భద్రత కల్పించేలా మన కుటుంబ వ్యవస్థ ఉంటుంది. మన పురాణాల గురించి పిల్లలకు సోదాహరణంగా వివరించాలి. మన పురాణ పురుషుల గొప్పదనాన్ని యువతకు తెలియజేయాలని.” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story