మేటి నగరంగా అమరావతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-30 14:42:32  IST  )

అమరావతి నూతన గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా అవతరిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ..

మేటి నగరంగా అమరావతి
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి నూతన గ్రీన్‌ ఫీల్డ్‌ నగరంగా అవతరిస్తోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో స్పష్టం చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రధాని మోదీ నాయకత్వంలో 2038 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం తయారవుతుందన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనతో మనం ముందుకెళ్తున్నానని తెలిపారు. రాజధానికి అంత భూమి ఎందుకు, 100 ఎకరాల్లో సచివాలయం కట్టేస్తే చాలని ఎంతోమంది అన్నారని, కానీ జాతికి గుర్తింపు లభించాలన్నా, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలన్నా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు తెలిపారు.


‘‘కర్ణాటక రాష్ట్రానికి బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్‌ నగరాలున్నాయి. మనం అమరావతిని చిన్న నగరంగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతాం. అందుకే హైదరాబాద్‌ కంటే మెరుగైన నగరం కట్టాలని నిర్ణయించాం. ఈ 30 ఏళ్లలో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి జరిగింది. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి. అమెరికాలో సిలికాల్‌ వ్యాలీ ఉంది. మరి ఇండియాలో ఏముందని అడిగే వారికి అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ఉందన్నదే మన సమాధానం. ఆనాడు సైబరాబాద్‌ నిర్మించాం. నేడు క్వాంటమ్‌ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు ఇళ్లలో కరెంటే ఉండేది కాదు ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. 1999లో నాటి అసెంబ్లీలో కరెంటు గురించే గంటల కొద్దీ చర్చలు జరిగేవి. అప్పుడు విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చాం. విద్యుత్‌ రంగంలో మన దేశం నెంబర్‌ 1గా ఉండటం గర్వకారణం. అమెరికాలో కూడా నాలుగు గ్రిడ్‌ లు ఉండగా.. ప్రపంచంలో సింగిల్‌ పవర్‌ గ్రిడ్‌ ఉండే ఏకైక దేశం మనదే. సోలార్‌ విండ్‌ పంపుడ్‌ స్టోరేజీకి శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పదేళ్లలో గుంటూరు సహా అమరావతి ప్రాంత రూపురేఖలు ఎలా మారతాయో మీరే చూస్తారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయి. 182 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు వస్తుంది. రెన్యువబుల్‌ ఎనర్జీ ఉంటుంది. పొల్యూషన్‌ మాటే వినపడదు. 1995లో ఐటీని, 2000లో బయో టెక్నాలజీని ప్రమోట్‌ చేశాం. ఆనాడు జినోమ్‌ వ్యాలీకి భూములిచ్చి ప్రోత్సహించగా ఆ తర్వాత కాలంలో భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అక్కడి నుంచే తయారు చేసింది.’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పొగడ్తలు కాదు.. పని కావాలి...పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Next Story