ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి.. ట్రయల్ రన్‌ సక్సెస్‌పై సీఎం చంద్రబాబు హర్షం

by Ramesh Naini |

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయోగాత్మక విమానం విజయవంతంగా ల్యాండింగ్ కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి.. ట్రయల్ రన్‌ సక్సెస్‌పై సీఎం చంద్రబాబు హర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయోగాత్మక విమానం విజయవంతంగా ల్యాండింగ్ కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు, 2014-2019 మధ్య ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన నాలుగు శాతం పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేవలం 18 నెలల వ్యవధిలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే కారణమని పేర్కొంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి..

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఆ ప్రాంత కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని, అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని సీఎం అన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు, ఐటీ రంగం సహా వివిధ విభాగాల్లో అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ దిశగా ప్రజల ఆశీర్వాదం కొనసాగాలని కోరారు. ఈ శుభ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story