- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెల్టాను కాపాడుతున్నది పట్టిసీమ నీళ్లే : సీఎం చంద్రబాబు నాయుడు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమ క్షేత్రం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమతల్లులకు జలహారతి ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమ క్షేత్రం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమతల్లులకు జలహారతి ఇచ్చారు. అనంతరం సాగునీటి రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజనీరుగా కేఎల్ రావు అందించిన స్ఫూర్తిని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
డెల్టాను సస్యశ్యామలం చేసింది ఆయనే..
దేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ వంటి ప్రధానమైన డ్యామ్‌ల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. విజయవాడలో పుట్టి, ఎంపీగా గెలిచి, ముగ్గురు ప్రధానమంత్రుల వద్ద కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన.. ఐక్యరాజ్యసమితి తరఫున అంతర్జాతీయ జల నిపుణుడిగా ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాల్లోనూ సేవలు అందించారని గుర్తుచేశారు. నాడు సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలను నిర్మిస్తే, కేఎల్ రావు వాటిని ఆధునీకరించి డెల్టాను సస్యశ్యామలం చేశారన్నారు. శివరామకృష్ణయ్య, కేఎల్ రావుల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దటంలో వీరంతా తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని సీఎం పేర్కొన్నారు.
పట్టిసీమ రాకపోయుంటే..
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గి పంట సీజన్ మారిపోతున్న తరుణంలో, రైతులు తుపాన్ల బారిన పడి నష్టపోకుండా రక్షించాలనే ఉద్దేశంతోనే తాము పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాడు పట్టిసీమను కొందరు వట్టిసీమ అని అవహేళన చేశారని, ప్రాజెక్టు దండగ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2014లో విభజన తర్వాత తాము బస్సులోనే బస చేసి, పట్టుదలతో కేవలం 1300 కోట్ల రూపాయల ఖర్చుతో పట్టిసీమను పూర్తి చేశామని గుర్తుచేశారు. గడిచిన 2015 నుండి 2025 వరకు పట్టిసీమ ద్వారా 450 టీఎంసీల గోదావరి జలాలను తరలించామని, నీల వర్ణంలోని కృష్ణా జలాలు, అరుణ వర్ణంలోని గోదావరి జలాలు కలిసి ఈ ప్రాంతంలో బంగారం పండించాయని హర్షం వ్యక్తం చేశారు. ఏటా సగటున 2 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందని, పట్టిసీమ నీరే రాకపోతే.. నేడు కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటో అందరూ ఆలోచించాలన్నారు.
సీమకోసం ప్రత్యేక చర్యలు
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాము హైటెక్ సిటీ నిర్మిస్తుంటే దండగ అన్నారని, కానీ తాము ధైర్యంగా ముందుకు వెళ్లబట్టే నేడు హైదరాబాద్ ఐటీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలిచిందని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలోని కొందరు రాజకీయం కోసం రైతుల్ని రెచ్చగొట్టి చివరకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దేశంలో నదుల అనుసంధానం జరిగితే అద్భుతమైన అవకాశాలు ఉంటాయని, గోదావరి-కావేరి అనుసంధానాన్ని కేఎల్ రావు నాడే ప్రతిపాదించగా, వాజపేయి హయాంలో గంగా-కావేరి అనుసంధానం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోతున్న తరుణంలో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.






