నా జన్మ ధన్యమైంది.. అమరావతిని ఇక ఏ సైకో ఆపలేడు : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-09 08:14:36  IST  )

నా జన్మ ధన్యమైంది.. అమరావతిని ఇక ఏ సైకో ఆపలేడు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే పట్టాదారు పాసుపుస్తకాలను కరెన్సీ నోట్లు తయారు చేసే టెక్నాలజీతో రూపొందించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా సూరేపల్లి గ్రామంలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పట్టాదారు పాసుపుస్తకాలను అందుకున్న రైతుల కళ్లలో ఆనందం చూసి.. తన జన్మ ధన్యమైందన్నారు. కూటమి ప్రభుత్వంలో అందించిన సుపరిపాలనతో 21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఇకపై ప్రతి నెలా 9వ తేదీన ఒక ప్రాంతంలో రైతులకు పాసు పుస్తకాలు అందిస్తామని సీఎం మాటిచ్చారు. 2027 మార్చి నాటికి కోటి 12 లక్షల పాస్ పుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది జులై నాటికి 32 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల జీవనోపాధిపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు జాలర్లు ఆంధ్రా తీరంలోకి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఆంధ్రా మత్స్యకారుల జీవితాలపై దెబ్బకొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇక గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్నీ సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అని, ఎంతో క్లీన్ బీచ్ కూడా అన్నారు. మున్ముందు గోవా తరహాలో సూర్యలంక బీచ్ పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. సూర్యలంక బీచ్ ను మరింత సుందరంగా మారుస్తామన్నారు. ఫలితంగా ఆదాయం పెరుగుతుందని, ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని తెలిపారు.

ఆస్తుల కోసం తల్లీ చెల్లిని రోడ్డుకీడ్చిన వ్యక్తిని ఎవ్వరూ ఆదర్శంగా తీసుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. బాబాయ్ ను చంపి ఆ నేరం తనపై వేశాడని దుయ్యబట్టారు. అమరావతిపై కనీస సభ్యత లేకుండా జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. నాడు మూడు రాజధానులతో అయోమయం సృష్టించి.. నేడు మావిగన్ స్వరం అందుకున్నాడని, అమరావతిపై జగన్ కక్షగట్టాడన్నారు. అమరావతి విషయంలో న్యాయం, ధర్మం, చట్టం గెలిచాయని, ఇక అజేయంగా ముందుకు సాగుతుందన్నారు. ఏపీకి అమరావతిని రాజధానిని చేస్తూ.. కేంద్రం రాజముద్ర వేసిందని, ఇక దానిని ఎవ్వరూ ఏం చేయలేరన్నారు. కొందరు అమరావతిని కట్టలేమని విమర్శిస్తున్నారని, వారందరికీ చేతల్లో సమాధానం చెప్తానన్నారు. ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతిని హైదరాబాద్ ను తలదన్నేలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. 1000 మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదని సీఎం స్పష్టం చేశారు.

Next Story