‘సురవరం’ మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. నమ్మలేకపోతున్నా అని ట్వీట్

by Kema Shiva Kumar |

కమ్యూనిస్టు యోధుడు, CPI మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) హైదరాబాద్‌ గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

‘సురవరం’ మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. నమ్మలేకపోతున్నా అని ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టు యోధుడు, CPI మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) హైదరాబాద్‌ గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయసు మీద పడటంతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఆయనకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చూస్తూ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, మాజీ పార్లమెంటు సభ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే పనిచేసే సుధాకర్ రెడ్డి ఇక లేరంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. సమకాలీన రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచలుగా ఎదిగి సీపీఐ పార్టీలో జాతీయ కార్యదర్శి స్థాయికి సురవరం చేరారని కొనియాడారు. ఏ పదవిలో ఉన్నా విలువలతో రాజీ పడకుండా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులర్పిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story