విశాఖకు గుడ్ న్యూస్.. త్వరలో సీ కేబుల్, డేటా సెంటర్లు

by Vemula.Srinu Prasad |

విశాఖకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు...

విశాఖకు గుడ్ న్యూస్.. త్వరలో సీ కేబుల్, డేటా సెంటర్లు
X

దిశ వెబ్ డెస్క్: విశాఖకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గుడ్ న్యూస్ తెలిపారు. ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సు(India Food Manufacturing Conference)కు హాజరైన ఆయన విశాఖ(Visakhapatnam)లో పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. త్వరలోనే సీ కేబుల్ , డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా తదితర రంగాల్లో అపారమైన అవకాశాలను చాటిచెప్పేలా టీపీసీఐ సదస్సును నిర్వహించటం అభినందనీయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమ విలువ 8 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. 2030 నాటికి 700 బిలియన్ల డాలర్లకు దేశంలోని ఆహారశుద్ధి పరిశ్రమ చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోందని తెలిపారు. అయితే ఈ రంగంలో దేశం ఇంకా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏపీ 9% వాటాతో 50 బిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉందన్నారు.

‘‘జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏ రూ. 5.19 లక్షల కోట్ల మేర ఉంది. ఏపీ జీఎస్డీపీ(AP GSDP)లో 35 శాతం మేర వాటాను వ్యవసాయం అనుబంధ రంగాలు కలిగి ఉన్నాయి. ఏపీ ప్రస్తుతం ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంది. త్వరలోనే మొత్తం ఉత్పత్తిలో 25 శాతానికి చేరుకుంటాం. 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ చేస్తున్న ఏపీ దేశానికే ఆక్వా హబ్‌గా ఉంది. ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అందిపుచ్చుకోవాలి. పట్టణీకరణ, జీవనశైలి, తలసరి ఆదాయాలు కొత్త అవకాశాలకు దారితీస్తున్నాయి. ఏపీలోని చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర జిల్లాలు, విశాఖలలో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకూ, కాఫీ లాంటి క్లస్టర్లు ఉన్నాయి. గ్లోబల్ బ్రాండ్స్ ఫ్రమ్ ఇండియా బై ఇండియన్స్ అనేది మన నినాదం కావాలి. ఏపీలో అంతర్జాతీయస్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టం ఉంది. 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, 33 లక్షల టన్నుల గోదాముల సామర్ధ్యం ఉంది.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story