- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తిగత కక్షలు వద్దు.. సబ్జెక్ట్‌తోనే సభకు రావాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా మార్చవద్దని కూటమి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా మార్చవద్దని కూటమి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సభకు పూర్తిస్థాయిలో సిద్ధమై సబ్జెక్ట్‌తోనే రావాలని స్పష్టం చేశారు. 20 నెలలుగా కూటమి నేతల మధ్య ఐక్యత కొనసాగుతోందని పేర్కొన్న సీఎం, ఇదే స్ఫూర్తి కింది స్థాయిలోనూ కనిపించాలని అన్నారు. జిల్లా స్థాయిలో మూడు పార్టీల నాయకులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఐక్యతను మరింత బలపర్చుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తానని చంద్రబాబు తెలిపారు. అవసరమైతే 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడతానన్నారు. సభలో ఆవు కథలు చెప్పడం మానేసి, సబ్జెక్ట్‌ను పూర్తిగా సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటానని చెప్పారు. అసెంబ్లీ జరుగుతున్న రోజుల్లో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ్యులంతా తప్పనిసరిగా సభలో ఉండాలని సూచించారు. తాను కూడా ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి సభ ముగిసే వరకు అసెంబ్లీలో ఉంటానని తెలిపారు.
ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి
సభలో మాట్లాడేది 5 కోట్ల మంది ప్రజల తరఫుననేనని గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. అనుకున్న అంశాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో స్పష్టంగా వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా హైవే పనులు, రూ.90 వేల కోట్లకు పైగా రైల్వే పనులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని తెలిపారు. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.450 కోట్ల నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రస్తుతం రూ.54 కోట్ల లాభాల్లోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో రాష్ట్రానికి తీసుకురావాలని సూచించారు.
మతసామరస్యం అవసరం
అన్ని మతాలను గౌరవించాలని, భక్తుల సెంటిమెంట్‌ను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో మతాల పట్ల గౌరవం లేకపోవడం వల్లే రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయని విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ సహా అనేక చోట్ల కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు.






