- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక భేటీలు జరుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలు దిగ్గజ సంస్థల అధినేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఇందులో భాగంగా ఐబీఎం ఛైర్మన్, సీఈవో అర్వింద్ కృష్ణతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అమరావతికి క్వాంటం ఇన్నోవేషన్..
ఈ భేటీలో ప్రధానంగా టెక్నాలజీ రంగంలో ఏపీకి రావాల్సిన అవకాశాలపై చర్చ జరిగింది. రాజధాని అమరావతిలో 'క్వాంటం కంప్యూటింగ్ ఇన్నోవేషన్ సెంటర్'ను నెలకొల్పాలని చంద్రబాబు ఐబీఎంను కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఉంచిన ప్రతిపాదనలపై ఐబీఎం సీఈవో సానుకూలంగా స్పందించారు. భవిష్యత్ సాంకేతికతగా భావిస్తున్న కృత్రిమ మేధ (AI)లో భారత్‌లోని 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించింది. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేశ్ ఐబీఎం ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్..
అనంతరం గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న 'ఏఐ డేటా సెంటర్' నిర్మాణంపై ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగింది. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా, డేటా సెంటర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని థామస్ కురియన్‌ను సీఎం కోరారు.
తెలుగు వారి సత్తా చాటాలి..
ఈ సందర్భంగా నాలెడ్జ్ ఎకానమీ ప్రాధాన్యతను వివరిస్తూ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మారుస్తోంది. దీని ద్వారానే నిజమైన సంపద సృష్టి జరుగుతుంది. భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ఎప్పుడూ ముందుంటారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు," అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం దావోస్‌లో జరిగిన సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు.






