- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి భక్తులకు తీరనున్న వసతి కష్టాలు.. అందుబాటులోకి వేంకటాద్రి నిలయం
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు వసతి కష్టాలు తీరనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు వసతి కష్టాలు తీరనున్నాయి. కొత్తగా నిర్మించిన వేంకటాద్రి నిలయం (వసతి సముదాయం) నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. వేంకటాద్రి నిలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా తిరుమలకు వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు ఈ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనంలో ఒకేసారి 4 వేల మంది భక్తులు వసతి సౌకర్యాన్ని పొందవచ్చని టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ, క్యూలైన్ నిర్వహణ, తక్షణ సమస్యల నివారణ చర్యల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
ఈ నూతన వసతి సముదాయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ (PAC)5ను తీర్చిదిద్దారు. అలాగే ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా పీఏసీ 5 ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది. 1400 మంది భక్తులు ఒకేసారి భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని అధికారులకు సూచించారు. అలాగే భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్సుల్లో భక్తి భావన పెంపొందించేలా ఆధ్యాత్మిక వీడియోలను, శ్రీవారి చరిత్రను ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో అలిపిరి నుంచే రద్దీ హీట్ మ్యాప్ లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ఏడుకొండలు ఏడు రంగులతో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానసిక ప్రశాంతత ఆలయాలలో మాత్రమే ఉంటుందని, ఆలయాల నిర్మాణాలకు, నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతకుముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో నిరీక్షణలో ఎంత మంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని సంబంధిత అధికారులు వివరించారు. దీంతో పాటు టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలని సీఎం చంద్రబాబు సూచించారు.






