జనసేన కమిటీల నియామకాల షురూ.. స్వయంగా పరిశీలిస్తున్నపవన్

by Vemula.Srinu Prasad |

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కమిటీల నియామక ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు....

జనసేన కమిటీల నియామకాల షురూ..  స్వయంగా పరిశీలిస్తున్నపవన్
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కమిటీల నియామక ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన 36 వేలకుపైగా దరఖాస్తులను స్వయంగా పరిశీలిస్తూ కమిటీల ఖరారు ప్రక్రియను ప్రారంభించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టం చేయాలనే లక్ష్యంతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను సేకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు.

దరఖాస్తుదారుల నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, సేవా కార్యక్రమాలు, రాజకీయ అనుభవం, పార్టీకోసం కేటాయించగల సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రక్షా దళ్, పరిపాలక్ దళ్, నిర్వాహక్ దళ్, వివాద విమోచన మండలి, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాల కమిటీలకు సభ్యులను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, భుజం నొప్పి, జ్వరంతో బాధపడుతున్న పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్ స్వయంగా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిటీల నియామక ప్రక్రియను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

Next Story