TDR Bonds: టీడీఆర్ ​బాండ్ల అక్రమాలపై సీఐడీ విచారణ.. మంత్రి నారాయణ

by Thanuru Gopichand |

విశాఖ‌లో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచార‌ణ జ‌రుగుతుందని, వారి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు

TDR Bonds: టీడీఆర్ ​బాండ్ల అక్రమాలపై సీఐడీ విచారణ.. మంత్రి నారాయణ
X

దిశ, డైనమిక్​ బ్యూరో : విశాఖ‌లో టీడీఆర్ బాండ్ల (TDR Bonds) అక్రమాలపై విజిలెన్స్ (Visilence), సీఐడీ (CID) విచార‌ణ జ‌రుగుతుందని, వారి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగూరి నారాయణ (Minister Narayana) తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గ‌త ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయన్నారు. విశాఖ‌లోనే (Visakha) కాదని త‌ణుకు, తిరుప‌తిలో కూడా అక్రమాలు జరిగాయని తెలిపారు. త‌ణుకులో రూ.63.24 కోట్ల విలువ ఉన్న చోట రూ.754 కోట్ల బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూర‌ల్ ఏరియాలో భూమి తీసుకుని ప‌ట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. తిరుప‌తిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం 965, విశాఖ‌లో 266 టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయని, మూడు నెలల లోగా బాండ్ల అక్రమాలపై స్పష్టత వస్తుందని నారాయణ పేర్కొన్నారు.

2007 లో ఎంఐజీ ఇళ్లు అభివృద్ధి చేసేలా రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ (Rajiv swagruha) తీసుకొచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతపురం, కర్నూలులో ప్రాజెక్ట్ పూర్తయిందని, మిగిలిన చోట్ల పెండింగ్ ఉందన్నారు. మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని తెలిపారు. ధరల విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు ఇచ్చిందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాజెక్ట్ అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు.

Next Story