అష్ట దిగ్బంధనం దిశగా సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు అలైన్‌మెంటులో మార్పులు చేయడం ద్వారా హెరిటేజ్​ సంస్థ భూములకు విలువ పెంచుకున్నారనేది సీఐడీ అభియోగం..

అష్ట దిగ్బంధనం దిశగా సీఎం జగన్
X
  • చంద్రబాబు ఫ్యామిలీని కేసుల్లో ఇరికించే యత్నం
  • సీన్ రివర్స్ అవుతుందేమోనని వైసీపీలో టెన్షన్

ప్రతిపక్షనేత చంద్రబాబు కుటుంబాన్ని కేసులతో అష్టదిగ్బంధనం చేసే దిశగా సీఎం జగన్​ అడుగులు పడుతున్నాయి. ఇన్నర్​ రింగ్​ రోడ్ (ఐఆర్ఆర్) కేసులో నారా లోకేశ్​కు సీఐడీ 41ఏ నోటీసులిచ్చింది. హెరిటేజ్​ సంస్థల్లో భాగస్వాములుగా ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణిని కూడా కేసులో నిందితులుగా చేర్చే అవకాశమున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు కుటుంబం మొత్తం కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే పనిలో నిమగ్నమయ్యేట్లు చేయాలనేది అధికార పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. దీని వల్ల పరిస్థితులు ఎలా మారతాయోనని వైసీపీ శ్రేణులు గుబులు చెందుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు అలైన్‌మెంటులో మార్పులు చేయడం ద్వారా హెరిటేజ్​ సంస్థ భూములకు విలువ పెంచుకున్నారనేది సీఐడీ అభియోగం. 2010లో విజయవాడ నుంచి వేసిన బైపాస్​ రోడ్డు రాజధాని మధ్య నుంచి వెళ్తోంది. దీంట్లో రింగు రోడ్డును కలిపి కొనసాగించడానికి అవకాశమున్నా టీడీపీ నేతల భూముల దగ్గరకు రింగు రోడ్డును తీసుకెళ్లారనేది మరో ఆరోపణ. లింగమనేని రమేష్​ భూముల సమీపానికి రింగు రోడ్డును విస్తరించి లబ్ది చేకూర్చడం ద్వారా చంద్రబాబుకు గెస్ట్​ హౌస్​ ఇచ్చినట్లు సీఐడీ మెమోలో పేర్కొంది. ఇవన్నీ అవాస్తవాలని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు.

ఒక్క ఎకరం కూడా సేకరించలేదు..

టీడీపీ అధికారానికి రాకముందే 2013 మార్చిలో హెరిటేజ్​ భూములు కొనాలని తీర్మానం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. లింగమనేని రమేష్​ నుంచి కొనుగోలు చేయాలనుకున్న భూములు వివాదాస్పదం కావడంతో వెనక్కి తగ్గినట్లు పేర్కొంటున్నారు. రాజధాని మధ్యలోనుంచి ఎవరైనా రింగు రోడ్డు నిర్మిస్తారా అంటూ నిలదీస్తున్నారు. ఇంతవరకు అసలు రింగు రోడ్డు డీపీఆర్​ సిద్దం కాలేదు. డిజైన్​ దగ్గరే నిల్చిపోయింది. రోడ్డు నిర్మాణానికి ఒక్క ఎకరా భూమి సేకరించలేదు. ఒక్క రూపాయి ప్రభుత్వ సొమ్ము వెచ్చించలేదంటూ టీడీపీ నేతలు వివరిస్తున్నారు. ఇక, ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అక్రమాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు.

లోకేశ్​కు ఢిల్లీలో నోటీసులు జారీ..

రింగురోడ్డు కేసుకు సంబంధించి నారా లోకేష్​ను 14వ నిందితుడిగా సీఐడీ ఎఫ్​ఐఆర్​లో నమోదు చేసింది. సీఐడీ అధికారులు శనివారం ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్​ కార్యాలయంలో లోకేశ్​ను కలిశారు. 41ఏ నోటీసులను ఆయనకు అందించారు. అక్టోబరు 4న ఉదయం పది గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు.

వారిని ఇబ్బంది పెట్టడానికే..

రాజకీయ కక్షతో ఇలాంటి తప్పుడు కేసులతో చంద్రబాబు, లోకేశ్‌ల​ను ఇబ్బందులకు గురిచేయడానికి సీఎం జగన్​ ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. హెరిటేజ్​లో భాగస్వాములుగా ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణి పేర్లను కూడా ఎఫ్​ఐఆర్​లో చేర్చే అవకాశమున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశముండొచ్చని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. కేసుల విషయంలో సీఎం ఇదే దూకుడు ప్రదర్శిస్తే తమ భవితవ్యం ఎలా ఉంటుందోననే సందేహం వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తోంది.

Next Story