మహిళా దినోత్సవం నాడు మహిళల ఉగ్రరూపం.. వైన్ షాప్ బ్యానర్లు దగ్ధం!

by Jakkula.Mamatha |

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో మహిళలు ఉగ్రరూపం ప్రదర్శించారు.

మహిళా దినోత్సవం నాడు మహిళల ఉగ్రరూపం.. వైన్ షాప్ బ్యానర్లు దగ్ధం!
X

దిశ ప్రతినిధి, తిరుపతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో మహిళలు ఉగ్రరూపం ప్రదర్శించారు. సాయినగర్ లో నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ వద్ద ఆందోళనకు దిగారు. బైరాగి పట్టెడ సీపీఐ కార్యాలయం నుంచి తొలుత మహిళలు ప్రదర్శనగా వైన్ షాప్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్దిరోజులుగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ వైన్ షాప్ అక్కడే కొనసాగిస్తుండడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో షాప్ బ్యానర్లు చించివేసి దగ్ధం చేశారు. వైన్ షాప్ షట్టర్లు మూసి వేసి నిరసనకు పూనుకున్నారు. బ్యానర్లు దగ్ధం చేయరాదు అంటూ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైన్ షాప్ యజమానులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని, నివాసాలు, బ్యాంకులు, విద్యార్థుల హాస్టల్, ఆస్పత్రి మధ్య ఏర్పాటుచేసిన దుకాణాన్ని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Next Story