- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి భక్తులకు సాంప్రదాయ వంటకాలు అందించాలి: టీటీడీ అదనపు ఈవో
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు.

దిశ, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను అందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత, నిర్వహణ చక్కగా ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలోని ఆస్థానమండపంలో గురువారం హోటళ్ల నిర్వాహకులు, స్థానికులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను భక్తిశ్రద్ధలతో అందించాలన్నారు. తిరుమల యాత్ర భక్తులకు ఒక మధురానుభూతిని కల్పించాలన్నారు. హోటల్ నిర్వాహకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భక్తులు చాలా అసంతృప్తితో వెళుతున్నారని చెప్పారు.
హోటళ్ల యజమానులు చట్టబద్ధమైన నియమ నిబంధనలను పాటించాలని, ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం ప్రతిరోజు చేయవలసిన పనులతో కూడిన చెక్లిస్ట్ అందిస్తుందని, దానిని తప్పకుండా పాటించాలన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో 33 అన్నప్రసాద కౌంటర్లలో టీటీడీ నాణ్యమైన భోజనం అందిస్తుందన్నారు.
అదేవిధంగా భగవంతుని సన్నిధిలోని హోటళ్ల యజమానులు కూడా మంచి తినుబండారాలు అందించాలన్నారు. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. హోటల్లో నిర్వాహకులు, పనిచేసే సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణ ధరించి భక్తులకు సేవలందించాలని, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. హోటల్లో వద్ద ట్రేడ్ లైసెన్స్, జిఎస్టి వంటి ధ్రువీకరణ పత్రాలను అధికారులకు కనిపించేలా డిస్ప్లే చేయాలన్నారు. భక్తులు డిజిటల్ పేమెంట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హోటల్ నిర్వహణ లైసెన్స్‌ను నిర్ణీత సమయంలో రెన్యువల్ చేసుకోవాలన్నారు. అన్ని దుకాణాలలో ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు సిలిండర్ ఏర్పాటు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులు నడిగి తెలుసుకోవాలన్నారు. హోటళ్ల లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, హోటల్లో యజమానులు సమిష్టిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భక్తులకు సురక్షితమైన తాగునీరు అందించాలన్నారు నీరు, విద్యుత్ వృధా కాకుండా వినియోగించుకోవాలని చెప్పారు. త్వరలో ఐదు నుంచి 10 హోటళ్లలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ విధి విధానాలు అమలు అయ్యేలా నిర్వాహకులు సహకరించాలన్నారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను టీటీడీ అధికారులు అందిస్తారని వివరించారు.
అనంతరం హోటళ్ల నిర్వాహకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అదనపు ఈవోకి వివరించారు. దీనిపై ఆయన అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు, అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శాస్త్రి, వీజీఓలు సదాలక్ష్మి, సురేంద్ర ఇతర అధికారులు, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు.






