ట్రాన్స్ ఫార్మర్ల దొంగలు అరెస్టు

by Thanuru Gopichand |

61 కేజీల కాపర్ వైరు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

ట్రాన్స్ ఫార్మర్ల దొంగలు అరెస్టు
X

దిశ, చిత్తూరు: జిల్లాలోని పలు మండలాల్లో వరుసగా ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరును దొంగిలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను కాణిపాకం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.85,400 విలువైన 61 కేజీల కాపర్ వైర్, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. గత కొంతకాలంగా కాణిపాకం, ఐరాల, పెనుమూరు, గంగాధర నెల్లూరు, ఎస్.ఆర్.పురం, పూతలపట్టు, ఎన్ఆర్ పేట, చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి సమయాల్లో వరుసగా ట్రాన్స్ ఫార్మర్లు దొంగతనానికి గురవుతున్నాయి. నిందితులు ఇప్పటివరకు 97 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి, సుమారు 1,000 కేజీల కాపర్ వైరును అపహరించినట్లు విచారణలో తేలింది. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 29కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. కాణిపాకం పరిధిలో జరిగిన చోరీపై ఎస్ఐ నరసింహులు నమోదు చేసిన కేసు ఆధారంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి రంగంలోకి దిగారు. చిత్తూరు ఎస్పీడీఓ టి.సాయినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, జనవరి 30 సాయంత్రం 6:30 గంటల సమయంలో టానా కూడలి వద్ద చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన పులిచర్ల బాలకృష్ణ రెడ్డి (42), పులిచర్ల చంద్రబాబు (39), జీడీ నెల్లూరు మండలం వెంకటాపురంకు చెందిన పి. గణేష్ (35)ను అదుపులోకి తీసుకుని విచారించగా .. వీరే చోరీలకు పాల్పడినట్ల తేలింది. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story