ఐపీఎల్ తరహాలో తిరుపతి కార్పొరేట్ క్రికెట్ లీగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-24 15:07:03  IST  )

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిరుపతిలో కార్పొరేట్ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ శ్రీకారం చుట్టింది...

ఐపీఎల్ తరహాలో తిరుపతి కార్పొరేట్ క్రికెట్ లీగ్
X

దిశ, తిరుపతి ప్రతినిధి: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిరుపతిలో కార్పొరేట్ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ శ్రీకారం చుట్టింది. కపిల తీర్థం రోడ్డులోని పాయ్ వైస్రాయ్ హోటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్ క్రికెట్ విజయ్ పర్యవేక్షణలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీంల ఎంపిక ప్రక్రియకు విశేష స్పందన లభించింది. ఊహించని విధంగా 22 టీంలు ఈ పోటీలో పాల్గొన్నాయి. అత్యధికంగా టీమ్లు రావడంతో నిర్వహించిన ఆక్షన్‌లో 8 టీం లను ఎంపిక చేయడం జరిగింది. ఉత్కంఠంగా జరిగిన ఈ ఆక్షన్‌లో తిరుపతి హోటల్స్, రమణ లాజిస్టిక్స్ జివిఎస్సిఎస్ టీచర్స్, జేశాప్, ఏపీ సిపిఎస్ఈఏ, జెఎస్ఈఈ, వార్డ్ సచివాలయం, ఎస్.సి.యు జట్లు చోటు దక్కించుకున్నాయి.

చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గేట్ కాలేజ్ అధినేత వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పక ఆడాలన్నారు. 30 సంవత్సరాలు పైబడి కూడా క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉన్నవారికి సీడీసీఏ ఇంత మంచి అవకాశం కల్పిస్తుండడం నిజంగా అభినందనీయమన్నారు. జిల్లాలోని క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి అసోసియేషన్ కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ (క్రికెట్ విజయ్) మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటిసారిగా సిడిసిఏ ఆధ్వర్యంలో ఇంత మంచి టోర్నీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తాము క్రికెట్ ఆడే సమయంలో మంచి క్రికెట్ ఆడలేకపోయాం అనుకునే క్రీడాకారులకు ఇది మంచి సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ టోర్నీలో 30 సంవత్సరాలు పూర్తయిన వారికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలియజేశారు. అంతేకాక మ్యాచ్లను 7 కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహిస్తుండడం వలన వారి ఆటను మరింతమంది ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మ్యాచ్ లన్ని ఐపీఎల్ తరహాలో ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం నిర్వహించనున్నామన్నారు. సిడిసిఏ చేసిన మొదటి ప్రయత్నంలోనే 22 టీంలు ఇందులో పాల్గొనడం నిజంగా అభినందనీయమన్నారు. టోర్నీలో 8 టీములకు మాత్రమే అవకాశం ఉన్నందున ఆక్షన్ ద్వారా 8 టీం లను ఎంపిక చేయడం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని టీములకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ 8 టీములను రెండు పూల్ గా వేసి లీగ్ పద్ధతిలో మ్యాచులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Next Story