తిరుమల : అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

by Thanuru Gopichand |

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 31వ‌ తేదీ తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది.

తిరుమల : అక్టోబ‌రు 31న‌ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబ‌రు 31వ‌ తేదీ తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 30 నుంచి న‌వంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌ ఆస్థాన మండపంలో ఘ‌నంగా నిర్వహించనున్నారు. అక్టోబ‌రు 31న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. అంతకు ముందు రోజైన అక్టోబరు 30న తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో మ‌ధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్త‌న‌, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్టోబ‌రు 31న మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ధార్మిక సందేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతాయి. న‌వంబ‌రు 1న ఉద‌యం 8.30 గంట‌ల‌కు సామూహిక నామ సంకీర్త‌న‌, ఉద‌యం 9.30 గంట‌ల నుంచి స్వామిజీలు ధార్మిక సందేశ‌ము ఇవ్వ‌నున్నారు.

పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారని అధికారులు తెలిపారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు.

Next Story