- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala : రాజకీయం వద్దు.. గోవింద నామమే ముద్దు
దేవుడి గుడికి దైవ దర్శనానికి.. ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్తాము. అంతేకాకుండా దేవాలయ (Temple) పరిసరాలను ఎంతో పవిత్రంగా భావిస్తాము.

దిశ, వెబ్ డెస్క్ : దేవుడి గుడికి దైవ దర్శనానికి.. ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్తాము. అంతేకాకుండా దేవాలయ (Temple) పరిసరాలను ఎంతో పవిత్రంగా భావిస్తాము. మడి, ఆచారం, సంప్రదాయాలకు నెలవుగా దేవాలయాన్ని భావిస్తాము. అలాంటి చోట భక్తికి, ఆచారానికి విరుద్ధంగా ప్రవర్తించడమంటే మహాపాపమే అవుతుంది. కానీ ఇటీవల దేవాలయాల చుట్టూ మాత్రమే కాదు, దేవాలయాల వద్ద కూడా రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకు తిరుమల (Tirumala) మినహాయింపు కాదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మంది ప్రముఖులు నిత్యం తిరుమల శ్రీవారిని (Srivaru) దర్శించుకుంటారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తల దాకా ఉంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు తిరుమలకు రాని రోజు ఉండదంటే నమ్మశక్యం కాదేమో. అయితే రాజకీయ నాయకులు వచ్చి దర్శనం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అదేదో ప్రెస్ క్లబ్ (Press Club) లా భావిస్తూ రాజకీయ వ్యాఖ్యలను చేస్తుంటారు. తిరుమలను రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారుస్తుంటారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) నిర్ణయించింది. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నిషేధం విధించింది.
తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం కాపాడాలని నిర్ణయించిన టీటీడీ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. రాజకీయ వ్యాఖ్యలపై సంపూర్ణ నిషేధం విధించింది. వీఐపీలు దర్శనం ముగించుకొని వచ్చే సమయానికి మైకులో ఓ ప్రకటనను (Annoucement) విడుదల చేస్తోంది. రాజకీయ ప్రసంగాలు, అభ్యంతరకర వ్యాఖ్యలను తిరుమల కొండపై చేయొద్దని ప్రకటిస్తోంది. ఎవరైనా కాదు కూడదని నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి రోజా (Roja), సినీనటి శైలజ వేర్వేరుగా తిరుమల దర్శనానికి తమ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. స్వామి వారి సేవలో భాగమై మొక్కులను చెల్లించుకున్నారు. వారు దర్శనం చేసుకొని బయటకు వచ్చే సమయానికి టీటీడీ మైకుల ద్వారా ప్రకటనను చేసింది. దీంతో వారు తిరుమల పవిత్రతను కాపాడుతూ రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా ఉండిపోయారు. కేవలం కార్తీక మాస విశిష్టతను వివరించి వెళ్లిపోయారు. రాజకీయ, వివాదాస్పద వ్యాఖ్యలపై నిషేధం విధిస్తూ టీటీడీ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.






